Friday, November 22, 2024

Tripura: కాంగ్రెస్ లో చేరిన బీజేపీ ఎమ్మెల్యేలు

త్రిపురలో బీజేపీకి ఆపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. బీజేపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు సోమవారం రాజీనామా చేసిన సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ సాహా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. అనంతరం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే, ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు బుర్బా మోహన్ త్రిపుర, దిబా చంద్ర హ్రాంగ్‌ఖాల్ కూడా పాల్గొన్నారు. అయితే వారు ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు.

బీజేపీ ప్రభుత్వ హయాంలో త్రిపురలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతోందని ఎమ్మెల్యే ఆశిష్ సాహా ఆరోపించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పాలన అందించడంలో బీజేపీ విఫలమైందని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌లో చేరిన అనంతరం సుదీప్ రాయ్ తెలిపారు. సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో నిరీక్షిస్తున్నట్లు చెప్పారు. బీజేపీలోని ప్రతి ఒక్కరు భ్రమల్లో ఉన్నారని అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటే త్రిపురలోనూ ఎన్నికలు జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

కాగా, 60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీలో ఇప్పుడు బీజేపీ బలం 33కి తగ్గింది. 2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా బర్మన్‌ను మంత్రి పదవి నుంచి తప్పించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజీనామాల వ్యవహారంలో ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ త్రిపుర ఇన్‌చార్జి అజయ్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బిరాజిత్ సిన్హా కీలక పాత్ర పోషించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement