ప్రధాన పార్టీలు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేశాయి. దీనిలో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఒక నెల ముందు రాష్ట్రంలో ప్రజల దగ్గరకు వెళ్లడానికి రథయాత్రను చేపట్టనున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయట. త్రిపురలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జనవరి మొదటి నుండి రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించనుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాషాయ పార్టీ సిద్ధమవుతుందని పార్టీ నాయకుడు సోమవారం వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్త రథయాత్ర సన్నాహాలను పర్యవేక్షించేందుకు సమాచార, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుశాంత చౌదరి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉత్తర త్రిపుర జిల్లా నుంచి ఒక యాత్ర, దక్షిణ త్రిపుర జిల్లా నుంచి మరో యాత్ర బయలుదేరుతుందని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ సునీత్ సర్కార్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజల ఆశీస్సులు పొందడమే యాత్ర లక్ష్యమని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సుబర్త చక్రవర్తి తెలిపారు. ప్రజలు తమ ప్రాథమిక అవసరాలను తీర్చిన పార్టీకి సంఘీభావం తెలిపేందుకు ‘రథయాత్ర’లో చేరతారని మేం నమ్ముతున్నాం అని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఈశాన్య రాష్ట్రంలో తొలిసారిగా రాజకీయ పార్టీ ఇలాంటి యాత్రను నిర్వహించనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, బీజేపీ అనేక రోడ్ షోలు నిర్వహించింది, వాటికి అనేక మంది కేంద్ర మంత్రులు నాయకత్వం వహించారు. ఈ రోడ్ షోలు ఎన్నిల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టడంలో సాయపడ్డాయి.