పశ్చమబెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. అతి తక్కువ మంది దీదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ జగదీప్ ధన్‌కడ్ మమతతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ సహా కొందరు నేతలకే ఆహ్వానాలు పంపించారు. మమత మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వంటి కొద్దిమంది సమక్షంలో ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు.
కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లు గెలుపొందింది. బీజేపీ 77 స్థానాల్లో ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. అయితే, నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ తన స్థానంలో బీజేపీ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. బెంగాల్ సీఎంగా మూడో సారి ఆమె ప్రమాణం చేశారు.