Monday, November 18, 2024

Tributes to Ratan Tata – జన జీవనంలో టాటా! ప్రతి ఇంట్లోనూ నిలిచి’పోయారు’

మానవత్వపు ధీరుడు
భారత పారిశ్రామిక శిఖరం
వ్యక్తిగతం కంటే.. దేశమే ప్రధానం
వాణిజ్య మానవత్వమే అతని నైజం
సేవలకు వీడ్కోలు చెప్పిన రతన్ టాటా
అంచెంచల అద్వితీయ శక్తి
అయినా.. సాదా సీదా జీవనమే
సేవలను కొనియాడుతున్న దేశ ప్రజలు

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్​:

ఇక్కడ అంకురించి , ఎక్కడో ఎదిగి.. ఇక్కడే మహా వృక్షంగా సేవలందించారు. భరత జాతికి ఆజన్మాంతం అంకితమయ్యారు. బ్రిటీష్ కాలంలో 28 డిసెంబర్ 1937న, బొంబాయిలో ఒక పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. అతను నావల్ టాటా, సూని టాటా తనయుడు. 1948లో, టాటాకు 10 వయస్సులో అతని తల్లిదండ్రులు విడిపోయారు.ఈ స్థితిలో రతన్ టాటాను నాయనమ్మ నవాజ్‌ బాయి పెంచారు. టాటా 8వ తరగతి వరకు ముంబైలోని క్యాంపియన్ స్కూల్‌లో చదివారు. అతను ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్, న్యూయార్క్ నగరంలోని రివర్‌ డేల్ కంట్రీ స్కూల్‌లో తన చదువును కొనసాగించారు. 1955లో పట్టభద్రుడయ్యారు. టాటా కార్నెల్ విశ్వవిద్యాలయంలో చేరాడు, దాని నుంచ అతను 1959లో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. కార్నెల్‌లో ఉన్నప్పుడు, టాటా ఆల్ఫా సిగ్మా ఫై ఫ్రాటెర్నిటీలో సభ్యుడయ్యాడు. 2008లో, టాటా కార్నెల్‌కు ఈ సంస్థ 50 మిలియన్ డాలర్ల బహుమతిగా ఇచ్చింది, విశ్వవిద్యాలయ చరిత్రలో అతిపెద్ద అంతర్జాతీయ దాతగా అవతరించింది.

అంచెలంచెలుగా.. అద్వితీయ శక్తిగా

- Advertisement -

భారతదేశ పారిశ్రామికవేత్త, దాత, టాటా సన్స్ కు పూర్వపు చైర్మన్. అతను 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూపునకు చైర్మన్ గా ఉన్నారు. తరువాత అక్టోబరు 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూఫునకు ఇంటెరిమ్‌ చైర్మన్ గా ఉన్నారు. టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతిగా కొనసాగారు, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) లను అందుకున్నారు.[5] అతను వ్యాపారంలో విలువలు, దాతృత్వానికి గుర్తింపు పొందారు. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జమ్‌షెడ్జీ టాటా కు మునిమనుమడు ఈ రతన్ టాటా . అతను అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా కార్నెల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ల పూర్వ విద్యార్థి.[8] అతను 1961లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో పనిచేసేటప్పుడు తన కంపెనీలో చేరారు, 1991లో జె.ఆర్.డి టాటా పదవీ విరమణ చేసిన తరువాత అతనికి వారసునిగా భాద్యతలు చేపట్టారు. అతను టాటాను ఎక్కువగా భారత -కేంద్రీకృత సమూహం నుంచి ప్రపంచ వ్యాపారంగా మార్చే ప్రయత్నంలో అమెరికన్ టీ కంపెనీ టెట్లీని సంపాదించడానికి టాటా టీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను సొంతం చేసుకోవడానికి టాటా మోటార్స్, టాటా స్టీల్ ఐరోపా (కోరస్)ను సంపాదించడానికి టాటా స్టీల్ ను పొందారు. ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి 10 వేలకోట్ల టర్నోవర్‌‌గా ఉన్న టాటా గ్రూప్ ఆదాయం, ఆయన పదవీ విరమణ చేసిన 2013 డిసెంబర్ నాటికి 83,500 కోట్ల టర్నోవరకు చేరుకుంది. గుండు సూది నుంచి నానో కారు వరకూ సామాన్యులకు తన ఉత్పత్తులు అందించారు. విమానయానం సదుపాయాన్ని కల్పించారు. విమానం ఎక్కాలంటే.. కోటీశ్వరులకే ఛాన్స్ .. కానీ ఈ రోజు సామాన్యుడు సైతం విమానం ఎక్కి చక్కర్లు కొట్టే స్థితికి తన వ్యాపారాన్ని పెంచారు.

జేఆర్డీ టాటా వారసుడిగా..

జేఆర్డీ టాటాకు 75 ఏళ్లు వచ్చినప్పుడు, ఆయన వారసుడు ఎవరు? అని విపరీతంగా చర్చ జరిగింది. ‘‘నాని పల్ఖివాలా, రుసీ మోదీ, షారుఖ్ సబ్వాలా, హెచ్‌ఎన్ సేథ్నాలలో ఒకరు ఆయన వారసులు అవుతారని అనుకున్నారు. రతన్ టాటా కూడా పాల్కివాలా, రుసీ మోదీలు ఇద్దరూ ప్రధాన అభ్యర్థులుగా భావించారు’’ అని టాటా బయోగ్రాఫర్ కేఎం లాలా రాశారు. 86 ఏళ్ల వయసులో 1991లో జేఆర్డీ టాటా చైర్మన్ పదవి నుంచి దిగిపోయినప్పుడు, కంపెనీ వారసత్వ బాధ్యతలు రతన్ టాటాకు అప్పజెప్పారు. టాటా స్నేహితుడు నుస్లీ వాడియా, ఆయన అసిస్టెంట్ షారుఖ్ సబ్వాలాలు రతన్ టాటా పేరును సమర్థించారు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు, దర్బారి సేత్, రుసీ మోదీ, అజిత్ కేర్కర్‌లను ఎలా బలహీనపర్చాలన్నది ఆయన ముందున్న సవాలు. ప్రధాన కార్యాలయం నుంచి ఎలాంటి జోక్యం లేకుండా ఇప్పటికీ ఈ ముగ్గురు టాటా కంపెనీల్లో పనిచేస్తున్నారు.

నిరాడంబర జీవితమే ఇష్టం!

సంపన్న కుటుంబంలో పుట్టినా అమెరికాలో సామాన్య జీవితం గడిపారు రతన్‌ టాటా. కొంత కాలం లాస్‌ ఏంజల్స్‌లోని జోన్స్‌ అండ్‌ ఎమెన్స్‌లో పనిచేశారు. ప్రముఖ కంప్యూటర్ సంస్థ ఐబీఎంలో ఉద్యోగం వచ్చినా చేరలేదు. తన తాత జేఈర్డీ టాటా సలహా మేరకు భారత్ వచ్చేశారు. అప్పటికే రతన్ తండ్రి నావల్‌ – టాటా గ్రూప్‌ డిప్యూట్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. కానీ రతన్‌ టాటా అట్టడుగు స్థాయి నుంచే టాటా గ్రూప్‌లోకి ప్రవేశించారు. 1962లో జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్‌ ఫ్యాక్టరీ ఉత్పత్తి విభాగంలో సాధారణ ఉద్యోగిగా చేరారు. అలా 9 ఏళ్లపాటు స్టీల్‌ ఫ్యాక్టరీలోని వివిధ విభాగాల్లో నలిగిన రతన్‌ టాటాకు, 1971లో తొలిసారి నాయకత్వ సవాల్‌ ఎదురైంది. నష్టాల్లో ఉన్న నేషనల్‌ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్‌-నెల్కో డైరక్టర్‌గా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. దాన్ని లాభాల్లోకి తేవడానికి ఆయన సర్వశక్తులూ ఒడ్డారు. అప్పటికే నెల్కోలో ఉన్న సీనియర్ల అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల వ్యాపారాన్ని విస్తృతం చేసి తన వ్యాపార దీక్షాదక్షతను చాటుకున్నారు. మనవడి కార్యదక్షతకు అబ్బురపడిన జేఆర్డీ టాటా 1977లో నష్టాల్లో నడుస్తున్న ఎంప్రెస్‌ మిల్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను రతన్కు అప్పగించారు. 1991లో టాటా ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌గా వైదొలిగిన జేఆర్డీ టాటా మనవడైన రతన్‌ టాటా చేతికి వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించారు. సాధారణ కార్మికుడిలా బ్లూ ఓవరాల్ ధరించి కెరీర్ ప్రారంభించారు. 1962లో రతన్ టాటా జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ సంస్థలో పనిచేయడం ప్రారంభించారు. ‘‘రతన్ జెంషెడ్‌పూర్‌లో ఆరేళ్లు ఉన్నారు. మొదట్లో ఆయన ఒక షాప్‌ఫ్లోర్ కార్మికుడిలా బ్లూ ఓవరాల్ ధరించి అప్రెంటిస్‌షిప్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేశారు’’ అని గిరీష్ కుమార్ తన పుస్తకంలో రాశారు. ఆ తర్వాత ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే నానావతికి స్పెషల్ అసిస్టెంట్ అయ్యారు. ఆయన చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అన్న విషయం ముంబయి వరకూ చేరింది. దీంతో జేఆర్డీ టాటా ఆయన్ను ముంబయికి పిలిపించారు. ఆ తర్వాత రతన్ ఆస్ట్రేలియాలో ఏడాది పాటు పనిచేశారు. రతన్ టాటాకు సెంట్రల్ మిల్, నెల్కో లాంటి నష్టాల్లో ఉన్న కంపెనీలను గాడినపెట్టే బాధ్యతలను అప్పగించారు జేఆర్డీ. రతన్ టాటా నేతృత్వంలో మూడేళ్లలోనే నెల్కో దశ మారిపోయింది. అది లాభాలు ఆర్జించడం మొదలుపెట్టింది. 1981లో రతన్‌ టాటాను ఇండస్ట్రీస్‌కు చీఫ్‌గా జేఆర్టీ నియమించారు.

వ్యాపార సామ్రాజ్య విస్తరణ

టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రతన్‌ టాటా సంస్థను భారీగా విస్తరించారు. దేశంలో ఆర్థిక సంస్కరణల సమయంలో గ్రూపును రతన్‌ టాటా పునర్వ్యవస్థీకరించారు. క్యాపిటల్‌ మార్కెట్‌కు ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునే వ్యూహాత్మక ప్రణాళికలు వేశారు. గ్రూప్‌నకు అప్పటిదాకా పరిచయంలేని కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. టెలీకమ్యూనికేషన్స్, బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సేవా రంగాల్లోకి అడుగు పెట్టారు. భవిష్యత్‌ వ్యాపారాన్ని ముందే పసిగట్టగల నేర్పున్న రతన్‌ టాటా, వివిధ రంగాల్లో కంపెనీలు ప్రారంభించారు. అది టాటాగ్రూప్‌ ప్రస్థానాన్నే పూర్తిగా మార్చేసింది. 2004లో పబ్లిక్‌ ఇష్యూకి తెచ్చిన టీసీఎస్ దేశ, విదేశాల్లో సేవలందించే సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా రాణిస్తోంది.

బిజినెస్ టేకోవర్స్

అంతర్జాతీయంగానూ టాటా గ్రూపును విస్తరించడంలో రతన్ టాటా ఎనలేని కృషి చేశారు. ఆంగ్లో-డచ్‌ స్టీల్‌ కంపెనీ కోరస్‌ను టేకోవర్‌ చేశారు. బ్రిటిష్‌ వాహన దిగ్గజం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ను కూడా కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని విలాసవంతమైన కార్ల తయారీకి బ్రాండ్‌గా మార్చేశారు. టాటా మోటార్స్‌ రూపొందించిన టాటా ఇండికా కార్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌లో పెద్ద చరిత్రనే సృష్టించింది. సంపన్నులే కాదు, సామాన్యులు కూడా కార్లో ఎందుకు వెళ్లకూడదనే ప్రశ్నకు సమాధానమే నానో కార్‌. కేవలం లక్ష రూపాయలకే కారు అందిస్తామని రతన్ టాటా ప్రకటించగానే, ఆయన్ను అందరూ వ్యతిరేకించారు. కానీ అన్నమాట ప్రకారం నానో కారును మార్కెట్‌లోకి తెచ్చి, పేదవాడి చేతికి కారు స్టీరింగ్‌ అప్పగించారు రతన్ టాటా. ఇక రతన్ టాటా టోకేవర్ చేసిన మరో బ్రిటిష్‌ టీ కంపెనీ టెట్లీ కూడా మార్కెట్‌లో అగ్రగామిగా నిలిచిపోయింది. ఇక అంకుర సంస్థల్ని ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. వ్యక్తిగత హోదాలో ఓలా ఎలక్ట్రిక్, పేటీఎం, స్నాప్‌డీల్, లెన్స్‌కార్ట్, జివామే వంటి 30 అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు రతన్.

రక్షణ, విమానయాన రంగంలోనూ

రక్షణ,విమానయాన రంగంలో టాటా గ్రూప్‌ దేశంలో అగ్రగామిగా వెలుగొందడంలోనూ రతన్‌ టాటా ఎనలేని కృషిచేశారు. విమానయాన రంగంలో విడిభాగాల తయారీలో టాటా సంస్థ ప్రపంచ సరఫరాదారుగా ఎదగడంలో రతన్‌ ముఖ్యపాత్ర పోషించారు. రక్షణ ఉత్పత్తులకు సంబంధించి రక్షణ మంత్రిత్వశాఖకు నమ్మకమైన భాగస్వామిగా టాటా డిఫెన్స్‌ను తీర్చిదిద్దారు. ప్రధాని మోదీ ఇచ్చిన భారత్‌లో తయారీ నినాదాన్ని గట్టిగా సమర్థించిన రతన్‌ టాటా యుద్ధవిమానాలు, హెలికాఫ్టర్లు, రవాణా విమానాలు, ఆయుధ వ్యవస్థలు, మానవ రహిత వ్యవస్థల తయారీని టాటా గ్రూప్‌ నుంచి పెద్దఎత్తున చేపట్టారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏరోఇంజిన్‌, విడిభాగాల తయారీ యూనిట్లను నెలకొల్పారు. లక్షల కోట్లు విలువైన సంస్థగా ‘టాటా ఏ అండ్‌ డీ’ని తీర్చిదిద్దారు. మరోవైపు టాటాలకు సొంత విమానయాన సంస్థ ఉండాలన్న చిరకాల కోరికను సైతం రతన్‌ టాటా సాకారం చేశారు. తమచేతి నుంచి చేజారిన ఎయిరిండియాను ఇటీవల తిరిగి ఆయన సొంతం చేసుకున్నారు.

కొత్త తరానికి ప్రోత్సాహం

కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే రతన్ టాటా తొలిసారి టాటా కుటుంబంలో కాకుండా బయటి వ్యక్తికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. 2012 డిసెంబరు 28న తన 75వ పుట్టిన రోజునాడు టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగారు. తన వారసుడిగా సైరస్ మిస్త్రీని ప్రకటించారు. అయితే మిస్త్రీపై పలు ఆరోపణలు రావడం వల్ల 2016 అక్టోబరు 24న మిస్త్రీని తొలగించి మళ్లీ రతన్‌ – టాటా గ్రూప్‌ తాత్కాలిక ఛైర్మన్‌ అయ్యారు. 2017 జనవరి 12న నటరాజన్‌ చంద్రశేఖరన్‌ను టాటాసన్స్‌ ఛైర్మన్‌గా నియమించారు. పదవీ విరమణ తర్వాత కూడా రతన్‌ టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతూ, కంపెనీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.

దేశమే.. ప్రధానం

రతన్‌ టాటా ఆ జన్మాంతం ‘దేశమే ముందు’ అనే సిద్ధాంతాన్ని ఆచరించారు. దేశ పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ ముందుండేవారు. అత్యంత నిరాడంబర జీవితాన్ని ఆయన గడిపారు. ముంబయిలోని చిన్న ఇంట్లో నివసించారు.పెళ్లికూడా చేసుకోలేదు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమలో పడిన రతన్‌ టాటా పెళ్లి మాత్రం చేసుకోలేకపోయారు. రతన్‌ ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు ఆ సమయంలో భారత్-చైనా యుద్ధం జరుగుతోందంటూ ఆమెను భారత్‌ పంపేందుకు నిరాకరించారు. దీనితో ఆయన జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. టాటా గ్రూప్‌ బాధ్యతల్లో నిమగ్నమయ్యాక ఇక ఆయన పెళ్లి గురించి ఆలోచించలేదు. టాటా గ్రూప్‌ విస్తరణకే తన జీవితాన్ని అంకితం చేశారు. పారిశ్రామిక మేరు నగధీరుడుగా చెప్పుకునే రతన్ టాటాను కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌, 2008లో పద్మవిభూషణ్‌తో ఘనంగా సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నవరత్న బిరుదు ఇచ్చింది. లెక్కలేనన్ని దేశ, విదేశీ విద్యాలయాలు, సంస్థలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు అందించి, తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. 2007 ఫిబ్రవరిలో బెంగళూరు వేదికగా ఎయిరో ఇండియా షో జరిగింది. ఈ షోలో అమెరికాకు చెందిన రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ కూడా పాల్గొని తన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా ఎఫ్-16ను నడపాలంటూ సంస్థ ఆహ్వానించడంతో రతన్ టాటా తొలిసారిగా యుద్ధ విమానాన్ని నడిపారు. అనుభవజ్ఞుడైన అమెరికా పైలట్ మార్గదర్శకత్వంలో కోపైలట్ రతన్ టాటా ఎఫ్-16లో గాల్లో దూసుకుపోయారు. దాదాపు అరగంట పాటు పూర్తిస్థాయిలో పైలట్‌గా విమానాన్ని నియంత్రిస్తూ ఎంజాయ్ చేశారు.

యుద్ధ విమానం నడపడం అంటే ఇష్టం..

యుద్ధ విమానం నడపడం ఒళ్లు గగుర్పొడిచే అనుభవం అని ఆయన ఆ తరువాత మీడియాకు తెలిపారు. ‘‘గగనతనంలో విహరిస్తున్నట్టు మానవ జీవితం ఎంత అల్పమైనదో స్ఫురణకు వస్తుంది. 500 అడుగుల ఎత్తులో మెరుపు వేగంతో ప్రయాణించాము. కమాండర్ నేతృత్వంలో కొన్ని సాహస విన్యాసాలు కూడా చేశాను. నమ్మశక్యం కానీ అనుభవం అది. ఒళ్లు గగుర్పొడిచే అనుభూతి’’ అని రతన్ టాటా చెప్పుకొచ్చారు. యుద్ధ విమానం నడుపుతూ రతన్ టాటా ఎంతో థ్రిల్ అయ్యారని ఎఫ్-16 కమాండర్ కూడా చెప్పుకొచ్చారు. ‘‘మా ప్రయాణంలో హైలైట్ అంటే.. 500 అడుగుల ఎత్తులో 600 నాట్‌ల వేగంతో దూసుకుపోవడమే. అసలు ఎఫ్-16 ఎంత వేగంగా వెళ్లగలదో తెలిసేది అప్పుడే’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఎయిర్ షో సందర్భంగా లాక్ హీడ్ మార్టిన్ రతన్ టాటాకు ఎఫ్-16 విమానానికి సంబంధించి ఓ చిన్న నమూనా బొమ్మను బహుమానంగా ఇచ్చింది. అయితే, ఎఫ్-16ను నడిపిన మరుసటి రోజే రతన్ టాటా మరో యుద్ధ విమానంలో విహరించారు. ఎఫ్-16 కంటే శక్తిమంతమైన ఎఫ్ -18 హార్నెట్ యుద్ధ విమానంలో ఆయన గగనతలంలో దూసుకుపోయారు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ కార్యకలాపాలకు ఎఫ్ – 18 అప్పట్లో కీలకంగా ఉండేది. వైమానిక రంగంపై విశేషాసక్తి కనబరిచే రతన్ టాటాకు వరుసగా రెండుసార్లు యుద్ధ విమానాల్లో విహరించే అవకాశం రావడంతో తన కల నేరవేరినట్టు భావించారట.

టెట్లీ, కోరస్, జాగ్వార్ కొనుగోళ్లు

రతన్ టాటా వ్యాపారాలను అర్థం చేసుకునే విధానంపై తొలుత చాలామంది పలు ప్రశ్నలు సంధించారు. కానీ, 2000లో బ్రిటీష్ టెట్లీ గ్రూప్‌ను కొనుగోలు చేసి, ఆయన అందర్ని ఆశ్చర్యపరిచారు. నేడు టాటా గ్లోబల్ బెవరేజస్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టీ కంపెనీ. ఆ తర్వాత యూరప్‌కు చెందిన రెండో అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ ‘కోరస్’ను కొనుగోలు చేశారు. ఈ డీల్‌పై విమర్శకులు పలు ప్రశ్నలు సంధించినప్పటికీ, తన సామర్థ్యాన్ని టాటా గ్రూప్ రుజువు చేసి చూపించింది. 2009లో ఢిల్లీ ఆటో ఎక్స్ సందర్భంగా లక్ష రూపాయలకే టాటా ‘నానో’ కారును ప్రజల ముందుకు తీసుకొచ్చారు. నానోకు ముందు 1998లో టాటా మోటార్స్ ‘ఇండికా’ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. భారత్‌లో డిజైన్ చేసిన తొలి కారు ఇదే. ఈ కారు తొలుత విఫలమైంది. దీంతో, ఫోర్డ్ మోటార్ కంపెనీకి దీన్ని అమ్మాలని రతన్ టాటా నిర్ణయించారు. డెట్రాయిట్ వెళ్లినప్పుడు బిల్ ఫోర్డ్‌ను కలిశారు. అయితే, ఈ వ్యాపారం గురించి సరైన అవగాహన లేనప్పుడు ఎందుకు ఈ రంగంలోకి వచ్చారంటూ ఆయన్ను ప్రశ్నించారు. ఒకవేళ తాము ‘ఇండికా’ను కొంటే, భారత కంపెనీకి చాలా పెద్ద మంచి పనిచేస్తున్నట్లు మాట్లాడారు. రతన్ టాటా బృందానికి ఆయన ప్రవర్తన, మాటలు కోపం తెప్పించాయి. సంభాషణను పూర్తి చేయకుండానే అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. ఆ తర్వాత, 2008లో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఫోర్డ్ కంపెనీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫోర్డ్ తన వ్యాపారాలను బ్రిటీష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌కు అమ్మింది. తమ లగ్జరీ కారు కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా ఫోర్డ్‌కు ఒక భారతీయ కంపెనీ గొప్ప ఉపకారం చేస్తున్నట్లు బిల్ బోర్డ్ అన్నట్లు కుమీ కపూర్ రాశారు. రతన్ టాటా ఈ రెండు ప్రముఖ బ్రాండ్లను 230 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశారు.

జాగ్వార్ కొనుగోళ్లుపై ..

రతన్ టాటా నేతృత్వంలో జరిగిన ఈ కొనుగోళ్లపై కొందరు వ్యాపార విశ్లేషకులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. రతన్ టాటా ఖరీదైన విదేశీ కొనుగోళ్లు ఆయనకు ఖరీదైన డీల్స్‌గా మారాయని వాళ్లు అన్నారు.టాటా స్టీల్ యూరప్ వైట్ ఎలిఫెంట్‌గా మారి, గ్రూప్‌ను తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టింది. రతన్ టాటా విదేశీ కొనుగోళ్లు పూర్తిగా అహంకారం, బ్యాడ్ టైమింగ్‌లో తీసుకున్నవని టీఎన్ నీనన్ అన్నారు. ‘గత రెండు దశాబ్దాలలో భారత వ్యాపారాల్లో అతిపెద్ద అవకాశం టెలికాం. కానీ, రతన్ టాటా ఆ అవకాశాన్ని వదులుకున్నారు’’ అని ఈ వ్యాపార విశ్లేషకులు అన్నారు. ‘‘రతన్ టాటా తప్పు మీద తప్పు చేస్తున్నారు. జాగ్వార్‌ను కొనడం ఆయన గ్రూప్‌కు ఆర్థిక భారమే. కానీ, టీసీఎస్ ఎల్లప్పుడూ టాటా గ్రూప్‌ను అగ్రస్థానంలో నిల బెడుతుంది’’ అని ప్రముఖ జర్నలిస్ట్ సుచేతా దలాల్ చెప్పారు. 2015లో టాటా గ్రూప్ నికర లాభంలో 60 శాతానికి పైగా ఈ కంపెనీ నుంచే వచ్చాయి. 2016లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టీసీఎస్ అతిపెద్ద కంపెనీగా ఉంది.

నీరా రాడియా, తనిష్క్, సైరస్ మిస్త్రీల వివాదం

లాబీయిస్ట్ నీరా రాడియాతో జరిగిన టెలిఫోన్ సంభాషణలు లీకవ్వడంతో 2010లో రతన్ టాటా పెద్ద వివాదంలో కూరుకున్నారు. ఆ తర్వాత 2020 అక్టోబర్‌లో, టాటా గ్రూప్ జ్యూవెల్లరీ బ్రాండ్ తనిష్క్ వ్యాపార ప్రకటన కూడా రతన్ టాటాకు పెద్ద తలనొప్పి అయింది. ఆ వ్యాపార ప్రకటనను తనిష్క్ వెనక్కి తీసుకుంది. జేఆర్డీ టాటా బతికి ఉంటే, ఇలాంటి ఒత్తిడి వచ్చేది కాదని చాలామంది భావించారు. కనీసం గంట కూడా సమయం ఇవ్వకుండా 2016 అక్టోబర్ 24న టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించినప్పుడు కూడా రతన్ టాటాపై విమర్శలు వచ్చాయి.

టాటా అంటే విశ్వసనీయత

కానీ ఇన్ని ఉన్నప్పటికీ, రతన్ టాటా ఎప్పుడూ భారత్‌లోని అత్యంత విశ్వసనీయ పారిశ్రామిక వేత్తల్లో లేరు. భారత్‌లో కోవిడ్ మహమ్మారి వ్యాపించినపుడు రతన్ టాటా అప్పటికప్పుడు టాటా ట్రస్టుల నుంచి రూ.500 కోట్లు, టాటా కంపెనీల నుంచి రూ.1000 కోట్లు ఇచ్చారు. ఆ సమయంలో కరోనా రోగులకు వైద్యం చేయడానికి ప్రాణాలకు తెగించిన డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఉండడం కోసం తమ లగ్జరీ హోటళ్లను ఉపయోగించుకోవచ్చని మొట్టమొదట చెప్పిన వ్యక్తి రతన్ టాటానే. ఇప్పటికీ భారత ట్రక్ డ్రైవర్లు తమ వాహనాల వెనుక భాగంలో ఓకే టాటా రాసుకుంటూ ఉంటారు. అంటే నేను నడిపే ఈ ట్రక్కు టాటాది, ఇది విశ్వసనీయమైనది అని చెప్పడానికే. టాటా వేసిన ఒక భారీ గ్లోబల్ ఫుట్‌ప్రింట్ కూడా ఉంది. ఈ జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లను నిర్మించేది ఈ కంపెనీనే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటి.

Advertisement

తాజా వార్తలు

Advertisement