నూనెను మంచి నీళ్లు తాగినట్లు గడగడ తాగేసింది ఓ మహిళ. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ‘ఖాందేవ్’ ఆలయంలో ఆదివాసీ మహిళ నూనె మొక్కు చెల్లించుకుంది. తొడసం వంశీయుల సమక్షంలో మట్టి పాత్రలో 2.5 కిలోల నువ్వుల నూనెను ఒకేసారి తాగింది.
ఆదివాసీల ఆరాధ్య దైవాల్లో ఖాందేవ్ ఒకరు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో తొడసం వంశస్తుల ఆరాధ్య దైవం ఖందేవ్ జాతర వైభవంగా జరుగుతోంది. పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా ఏటా తొడసం వంశస్తులు ఖందేవ్ జాతర నిర్వహిస్తారు. సంప్రదాయ డోలు వాయిద్యాలతో మహాపూజ నిర్వహించారు. నిష్టగా ఇళ్లలోనే తయారుచేసిన నువ్వుల నూనెను ఆలయానికి తీసుకువచ్చి ఖందేవ్‌కు నైవేద్యంగా సమర్పించారు. తర్వాత పూజలు నిర్వహించారు.
ప్రతీ ఏటా పుష్య మాసంలో జరిగే ఖాందేవ్ జాతరలో తొడసం వంశానికి చెందిన ఆడపడుచు ఈ నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మండలంలోని చిత్తగూడ గ్రామానికి చెందిన మాడవి యోత్మాబాయి వరుసగా మూడోసారి రెండు కిలోల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఇలా మొక్కు చెల్లించుకోవడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. తమ కుటుంబాలను, పాడి పంటలను ఖాందేవ్ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ నూనె మొక్కును చెల్లిస్తారు. వందేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఒకసారి నూనె మొక్కును చెల్లించే ఆదివాసీ మహిళ.. వరుసగా మూడేళ్ల పాటు ఆ మొక్కును చెల్లించాల్సి ఉంటుంది. గత మూడేళ్ల పాటు యాధవి అవంతి భాయ్ (38) అనే ఆదివాసీ మహిళ ఈ మొక్కు చెల్లించారు.
ఖాందేవ్ జాతర సందర్భంగా వందలాది ఆదివాసీలు ఆలయానికి తరలివచ్చారు. ప్రతీ ఏటా పుష్య మాసంలో ఆదివాసీలు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తొడసం వంశీయులు మహా పూజ నిర్వహిస్తారు. ఈ జాతరకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు జాతరకు తరలివస్తారు. ఈ జాతర ఈ నెల 30 వరకు జరగనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..