కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. ఎత్తిపోతలలో కీలకమైన భారీ రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేశారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్‌కు ట్రయల్ రన్ ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు అధికారులు మోటార్లను ప్రారంభించారు. ప్రస్తుతం మూడు మోటర్లతో ట్రయల్ రన్ చేశారు. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా కాళేశ్వరం కాల్వ నుంచి జలాశయంలోకి అధికారులు నీటిని మళ్లించనున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్ వద్ద పంప్‌హౌస్‌లో 8 భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు, మూడు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు రిజర్వాయర్ల ద్వారా మలన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ ఏడాది మల్లన్న సాగర్‌లో పది టీఎంసీలు నిల్వ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 50 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్దదైన మల్లన్నసాగర్ జలాశయంతో ఉమ్మడి మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలు సస్యస్యామలం కానున్నాయి.
మల్లన్న సాగర్ ట్రయల్ రన్‌పై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వప్నం నెరవేరిందని, మల్లన్నసాగర్ కల సాకారమైందని అన్నారు. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసిందని వెల్లడించారు. గోదారి గంగమ్మ మల్లన్న సాగరాన్ని ముద్దాడిందని, పట్టుదలతో పనిచేస్తే సాధ్యం కానిదేదీ లేదని తెలంగాణ ప్రభుత్వం చాటిందని చెప్పారు.
‘తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసింది. ప్రజలమీద విశ్వాసంతో పట్టుదలతో పనిచేస్తే కానిదేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నీటితో కళకళలాడుతోంది. ఈ ప్రాజెక్టులోకి మొదటి విడతగా 10 టీఎంసీల గోదావరి జలాలు ఈరోజు విడుదలయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. కేసీఆర్ స్వప్న సాక్షాత్కారం, తెలంగాణకు అమృత జలాభిషేకం. సాకారమైన మల్లన్న సాగరం. అనుమానాలు అపశకునాలు అవరోధాలు తలవంచి తప్పుకున్నయి. కుట్రలు కుహనా కేసులు వందల విమర్శలు వరద నీటిలో కొట్టుక పొయినయి. గోదారి గంగమ్మ మల్లన్న సాగరాన్ని ముద్దాడింది. కరువును శాశ్వతంగా సాగనంపింది.’ అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండిః ఆడపిల్లకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాః నారా లోకేశ్ ప్రతిజ్ఞ