ప్రకృతిని ఇష్టపడని వారు ఉంటారా చెప్పండి. అయితే నేటి టెక్నాలజీ యుగంలో అంతా కాంక్రీట్ మయమవుతుంది. దాంతో పిచ్చుక గూళ్లు, పచ్చని చెట్లు మాయమవుతున్నాయి. చెట్లను సైతం కొట్టేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. అయితే ఓ వ్యాపార వేత్త మాత్రం 40అడుగుల మామిడి చెట్టుని కొట్టేందుకు మనసు ఒప్పుకోలేదనుకుంటా. ఆ చెట్టుపైనే ఇంటిని నిర్మించుకున్నారు. రాజస్థాన్ లోని అజ్మీర్ కి చెందిన వ్యాపారవేత్త కుల్ ప్రదీప్ సింగ్ ఇల్లు ఉదయపూర్‌లో 40 అడుగుల మామిడి చెట్టుపై నిర్మించుకున్నాడు. ఈ మూడు-అంతస్తుల ట్రీహౌస్‌లో రెండు బెడ్‌రూమ్‌లు, వంటగది, లైబ్రరీ , లివింగ్ ఏరియా ఉన్నాయి.ఇప్పటికే ఈ ట్రీహౌస్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. అనేక మంది పర్యాటకులు సందర్శిస్తారు. అజ్మీర్ లోని అందమైన కోటలు, రాజభవనాలతో పాటు, ఈ అద్భుతమైన ట్రీహౌస్‌ను కూడా తమ పర్యటనలో భాగంగా చేర్చుకుంటారు.
కాగా తాను ఇలా చెట్టుపై ఇంటిని నిర్మించుకోవడానికి కారణం ప్రదీప్ సింగ్ వివరిస్తూ.. “మా ట్రీహౌస్ ఉన్న ప్రాంతం పండ్ల చెట్లకు ప్రసిద్ధి చెందింది. 4,000 చెట్లకు పైగా పండ్లు ఉండేవి.. వీటి పండ్లను విక్రయించి ప్రజలు జీవనం సాగించేవారు. అయితే జనాభా పెరుగుదల కారణంగా.. చెట్లను నరికివేయడం ప్రారంభించారన్నాడు. 1999 ఏడాదిలో ఉదయపూర్‌లో ప్రదీప్ సింగ్ తాను ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కోసం వెతుకుతున్నాడు. ఈ ప్రాంతంలోని చెట్లకు హాని చేయకూడదని నిర్ణయించుకున్నాడు. “చెట్లను నరకవద్దని, వాటిని మరెక్కడా నాటమని ప్రాపర్టీ డీలర్‌కి చెప్పినప్పుడు.. అతను ప్రదీప్ ఆలోచనలను తిరస్కరించి వెళ్లిపోయాడు. అప్పుడు ప్రదీప్ సింగ్ ఇల్లు కట్టుకోవడం ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. చెట్లను పెకిలించే బదులు.. దానిపైనే ఇల్లు కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక స్థలం దాని మధ్యలో మామిడి చెట్టు.. సరసమైన ధరకు కొనుగోలు చేశారు
ఒక ఆర్కిటెక్ట్ సహాయంతో సింగ్ ఇంటి నిర్మాణం ఒక సంవత్సరంలో పూర్తయింది. ఆ సమయంలో మామిడి చెట్టు సుమారు 20 అడుగుల ఎత్తులో ఉంది. అప్పుడు ఇల్లు రెండు అంతస్తులతో నిర్మించారు. భవనం నిర్మాణం మొత్తం ఉక్కుతో చేశారు. ఇంటి గోడలు, అంతస్తులు సెల్యులోజ్ షీట్‌తో పాటు ఫైబర్‌తో తయారు చేయబడ్డాయి. చెట్టు చుట్టూ నాలుగు స్తంభాలను ఉంచారు. ఇవి పిడుగుపాటు సమయంలో విద్యుత్ వాహకంగా పనిచేస్తాయి. తాను ఇల్లు నిర్మిస్తున్న సమయంలో ఖర్చు ఎంత అయిందని రికార్డ్ చేయలేదని ప్రదీప్ సింగ్ తెలిపాడు. అంతేకాదు తన ఇంటి మోడల్ చూసి ఆసక్తిగల వ్యక్తులు ఇలాంటి ఇంటిని నిర్మించేందుకు తనను సంప్రదించారని సింగ్ చెప్పారు. అయితే ఒక్కరు కూడా ఇదే విధంగా ఇంటిని నిర్మించలేదన్నాడు.
మామిడి చెట్టు 11 ఏళ్లలో 20 అడుగుల నుంచి 40 అడుగులకు పెరిగింది. ఇంతకుముందు రెండంతస్తులు ఉన్న సింగ్ ఇల్లు ఇప్పుడు మూడు అంతస్థులకు చేరుకుంది. మొదటి అంతస్తులో వంటగది, బాత్రూమ్ , డైనింగ్ హాల్ ఉన్నాయి. రెండవ అంతస్తులో, వాష్‌రూమ్, లైబ్రరీ , బెడ్‌రూమ్ ఉన్నాయి. మూడవ అంతస్తు పైకప్పుతో ఒకే గదితో ఉంటుంది. ఈ గాడి నుంచి చూస్తే చెట్టు అందమైన కొమ్మలను చూడవచ్చు. తన భార్య , కొడుకు, ఇలా తన ఫ్యామిలీ సభ్యుల జీవితం ఈ ఇంటిలో సంతోషంగా ఉందని చెప్పారు. తమకు ప్రతి వేసవిలో మామిడికాయలను బహుమతిగా ఇస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..