హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పని చేస్తున్న 69 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బదిలీ చేశారు. మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు వ్యవహారం తర్వాత ఇంత భారీ ఎత్తున బదిలీలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి విషయంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పది రోజుల క్రితం నిరంజన్‌రెడ్డిని బదిలీ చేసి ఆ స్థానంలో సీసీఎస్‌లో పని చేసిన హరిశ్చంద్రారెడ్డిని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే హరిశ్చంద్రారెడ్డి నిమయాకాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తిరిగి తాజా ఉత్తర్వుల్లో హరిశ్చంద్రారెడ్డిని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కీలకమైన పోలీస్ స్టేషన్లు సైఫాబాద్, బేగంబజార్, సైదాబాద్, రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న సీఐలతో పాటు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్, పోలీస్ కంట్రోల్ రూమ్ విభాగాల్లో ఉన్న వారందరికీ స్థానచలనం కల్పించారు. కొండరు ఇన్‌స్పెక్టర్లపై అవినీతి ఆరోపణలు రావడం, మరికొందరు విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం వంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఒకేసారి 69 మంది ఇన్‌స్పెక్టర్లను మారుస్తూ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.