Saturday, November 23, 2024

Spl Story: కష్టాలను తొక్కిపట్టి, కన్నీళ్లకు బ్రేకులేసింది.. పాండమిక్​ని దాటేసిన విమెన్​ డ్రైవర్​

కరోనా మహమ్మారి ప్రపంచ గమనాన్నే మార్చేసింది. అందులో పేదల బతుకులు మరీ ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి.. ప్రతి దానిపై విపరీతమైన ట్యాక్సులు, జీఎస్టీ విధించడంతో అన్నిటి ధరలు పెరిగిపోయాయి. అయినా.. వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డ వారే ఇప్పుడు ఈజీగా జీవనం సాగిస్తున్నారు. అందులో ఓ మహిళ తనకు ఎదురైన కష్టాలను, కన్నీలను ఎట్లా అధిగమించిందో.. పాండమిక్​ సిచ్యుయేషన్​ నుంచి ఎలా బయటపడిందో ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

మగాళ్ల పెత్తనం సాగే ఈ సమాజంలో ఓ మహిళ ఒంటరిగా జీవనం సాగించడం ఎంత కష్టమో ఈమె గాథ తెలుసుకుంటే అర్థమవుతుంది. కేవలం మగాళ్లకు మాత్రమే సొంతం అనుకున్న మోటార్​ వేహికల్​ డ్రైవింగ్ ఫీల్డ్​లోకి ఎంటరై.. తన కష్టాలను దాటుకుని సంతోషంగా జీవనం సాగిస్తోంది. మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన దండు లక్ష్మి కుటుంబం తొలుత ఉపాధి వేటలో హైదరాబాద్​ సిటీకి వచ్చింది. కుషాయిగూడలో ఉంటూ తన భర్త స్కూలు వ్యాన్​ నడుపేవాడు. ఇట్లా వచ్చే కొద్దిపాటి సంపాదనతో వారి కుటుంబ గడిచేది.. అయితే లక్ష్మి తన పిల్లలను స్కూలుకు తీసుకెళ్లడం, ఆ తర్వాత ఇంటికి తీసుకురావడం చేస్తుండేది. కొన్నాళ్లకు వారి పిల్లలు చదువుతున్న బడికి వేహికల్​లో పిల్లలను తీసుకుని డ్రైవ్​ చేసుకుంటూ వస్తున్న మహిళను చూసి ఇన్​స్పైర్​ అయ్యింది. తాను కూడా డ్రైవింగ్​ నేర్చుకుని భర్త కష్టంలో తోడుగా ఉండాలని అనుకుంది. డ్రైవింగ్​ నేర్చుకుంటానని చెప్పినప్పుడు తన భర్త అడ్డుచెప్పలేదు. పైగా ఆమె నిర్ణయాన్ని స్వాగతించి డ్రైవింగ్​ స్కూల్​లో చేర్పించాడు.

అయితే.. కాలం ఎప్పుడూ ఒకెలా ఉండదు.. వారి కుటుంబంలో అనుకోని విషాదాన్ని నింపింది. పాండమిక్​ ఫస్ట్​ వేవ్​లో లక్ష్మి భర్త అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతడిని కరోనా బలితీసుకుంది. ఇక అప్పటి నుంచి కుటుంబ బాధ్యత మొత్తం లక్ష్మి మీదనే పడింది. అయినా తను భయపడలేదు. క్యాబ్​ డ్రైవర్​గా కావాలని గట్టిగా నిర్ణయించుంది. అదే క్రమంలో జైలో వేహికల్​ని రెంటుకు తీసుకుని నడపడం ప్రారంభించింది. ఉబర్​ సంస్థలో చేరి రాత్రింబవళ్లు హైదరాబాద్​ సిటీలో డ్రైవింగ్​ చేస్తోంది.

అయితే.. సిటీలోనే పుట్టి, ఇక్కడే పెరిగిన వారికి రద్దీగా ఉండే రోడ్లపై కారు నడపడం అంటే భయంలేకపోవచ్చు. కానీ, మహబూబ్​నగర్​ వంటి వెనకబడ్డ జిల్లా నుంచి వచ్చిన లక్ష్మి తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.  అయినా, దేనికీ భయపడలేదు. విరామం లేకుండా 8-9 గంటలు కారు నడిపేది. దాంతో ఉబర్​ కమిషన్​, వేహికల్​ రెంట్​, ఇతర డీజిల్​ ఖర్చులు పోనూ రోజూ ఆమెకు 2వేల రూపాయలు గిట్టుబాటు అయ్యేది.

- Advertisement -

మహమ్మారి అన్నింటినీ మార్చేసింది..

COVID-19 మహమ్మారి సమయంలో లక్ష్మి తన భర్తను కోల్పోయింది. ఆమె భర్త కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. మొదటి వేవ్ సమయంలో వైరస్ అటాక్​ అయ్యింది. ఆ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక ఒక వారం రోజులకే చనిపోయాడు. భర్త మరణంతో కుటుంబానికి లక్ష్మి పెద్ద దిక్కైంది. ఆమె చేతిలో డబ్బుల్లేవు. ఇద్దరు పిల్లల బాధ్యత కూడా తనమీదనే పడింది. ఇక పెద్దబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. అతని ఫీజు చెల్లించలేదు. దీంతో డిగ్రీ ఫైనల్ పరీక్షలకు హాల్ టికెట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో అబ్బాయి చదువుకోసం కొంత అప్పు చేయాల్సి వచ్చింది. దానికి ఇప్పటికీ వడ్డీ కడుతున్నట్టు లక్ష్మీ చెబుతోంది. 

ఇక.. సిటీలో వర్షం పడినప్పుడు, హెల్త్​ బాగా లేనప్పుడు కొంతమంది డ్రైవర్లు వేహికల్​ బయటికి తీయకుండా ఇంట్లోనే ఉండిపోతారు. కానీ, అట్లాంటి క్రిటికల్​ టైమ్​లోనూ తాను సిటీలో వేహికల్​ నడుపుతానని లక్ష్మీ ధీమాగా చెబుతోంది. కొన్నిసార్లు రాత్రి 2 గంటలకు, తెల్లవారుజామున 3 గంటలకు కూడా పనిచేసిన రోజులున్నాయని చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం తాను నడుపుతున్న Xylo ధర, నెలవారీ అద్దె ఖర్చులు చెల్లించడం, EMIలు ప్రధాన ఖర్చులుగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే డబుల్​ బెడ్రూం ఇల్లుకు అర్హురాలినని, కాబట్టి తనకు ఇల్లు కేటాయిస్తే ప్రభుత్వం గొప్ప సహాయం చేసినట్టు అవుతుందని సీఎం కేసీఆర్​ను వేడుకుంటోంది. ఇక.. ఇట్లాగే ఇంకో ఏడాదిపాటు కష్టపడితే తన జీవితంలో ఈ దశను అధిగమించగలనని ఆశిస్తున్నట్టు తెలిపింది.

అయితే.. హైదరాబాద్​కు చెందిన సోషల్​ యాక్టివిస్టు హిమబిందు లక్ష్మి రెగ్యులర్​ కస్టమర్లలో ఒకరు. ఆమె కష్టాలను అర్థం చేసుకుని తోడుగా ఉండాలని భావించింది. దీంతో లక్ష్మికి సాయం చేయాలని నిర్ణయించుకుని ఫండ్​ రైజింగ్​ కార్యక్రమం చేపట్టింది. తాను చేపట్టిన ఈ కార్యక్రమానికి చాలామంది నుంచి సపోర్ట్​ లభిస్తోందని, ఇది లక్ష్మికి తాను ఇచ్చే పెద్దమొత్తం కాకపోయినా కాస్తైన ఊరట లభించే చాన్స్​ ఉంటుందని బిందు చెబుతోంది. ప్రస్తుతం ఆగస్టు 15వ తేదీ లోపు 45 వేల రూపాయలు సాయం చేయాలని టార్గెట్​ పెట్టుకున్నట్టు తెలిపింది.

మరి.. చిన్ని చిన్న కష్టాలు, ఇబ్బందులకే ఆత్మహత్యాయత్నం చేస్తూ జీవితాలను ఆగం చేసుకుంటున్న వారు..  లక్ష్మికి వచ్చిన కష్టాలు, వాటి నుంచి ఆమె ఎట్లా బయటపడిందో అవగాహన చేసుకోవాలి. ఎట్లాంటి కష్టం వచ్చినా బతకాలన్న ఆశ, ఏదైనా కొత్తగా సాధించాలన్న తపన ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించిన లక్ష్మిని ఆదర్శంగా తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement