Friday, November 22, 2024

శ‌త్రు దేశాల డ్రోన్ల‌ని నిలువ‌రించేందుకు- బ్లాక్ కైట్ పక్షులకు, కుక్కలకు శిక్షణ

భార‌త సైన్యం శ‌త్రు దేశాల నుంచి వ‌చ్చే డ్రోన్ల‌ని నిలువ‌రించేందుకు స‌రికొత్త ఆయుధాల‌ను రెడీ చేస్తుంది. ఇటీవలి కాలంలో పంజాబ్, రాజస్థాన్, జమ్మూ- కాశ్మీర్‌లలో అంతర్జాతీయ సరిహద్దులో అనేక డ్రోన్ చొరబాటు కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ సరిహద్దులో డ్రోన్ సంఘటనల భారీ పెరుగుదలను చూసిన తర్వాత బ్లాక్‌ కైట్ పక్షులకు, కుక్కలకు శిక్షణ ఇచ్చే ప్రాజెక్ట్ 2020లో ప్రారంభించబడింది. మీరట్‌లోని రిమౌంట్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్‌లో బ్లాక్ కైట్ పక్షులకు, కుక్కలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఉత్తరాఖండ్‌లోని ఔలి మిలిటరీ స్టేషన్‌లో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న యుధ్ అభ్యాస్ లో భారత సైన్యం ట్రైనింగ్ ఫలితాలను ప్రదర్శించింది. బ్లాక్ కైట్ పక్షిలో మౌంటెడ్ నిఘా కెమెరా, కాలులో జియో-పొజిషనింగ్ సిస్టమ్ ట్రాకర్ అమర్చబడి ఉంటాయి. అవి పక్షి ఆకాశంలో ఉన్నప్పుడు నేలపై ఉన్న హ్యాండ్లర్‌కు రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తాయి.

ఈ కసరత్తు జరుగుతున్న ప్రదేశ్‌లో క్వాడ్‌కాప్టర్ ఎగురుతున్నట్లు కనిపించింది. హ్యాండ్లర్ బ్లాక్ కైట్ పక్షిని ఆకాశంలో మోహరించారు. పక్షి క్వాడ్‌కాప్టర్‌పైకి దూసుకెళ్లి.. దానిని గోళ్లతో కొట్టి, అది పడిపోయేలా చేసింది. ప్రాజెక్ట్ ట్రయల్‌లో ఉంది. మొదటిసారిగా వాటిని ఒక కసరత్తులో ప్రదర్శించారు. అనేక యూరోపియన్ దేశాలు, యునైటెడ్ స్టేట్స్ పక్షులను నిఘా కోసం ఉపయోగిస్తున్నాయ‌ని భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. బ్లాక్ కైట్ అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి రాదు. దానిని ఎందుకు ఎంచుకున్నామంటే.. ఇది ఎగిరే వస్తువుపై దాడి చేసే సహజమైన స్వభావం కలిగిన వేటాడే పక్షి అని భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. కుక్క విషయానికి వస్తే.. అది జర్మన్ షెపర్డ్ జాతికి చెందినది. ఎగిరే వస్తువు గురించి సైన్యాన్ని లేదా హ్యాండ్లర్‌ను హెచ్చరించే విధంగా శిక్షణ పొందింది. మనుషుల కంటే కుక్కలకు శబ్దాలు వినే సామర్థ్యం ఎక్కువ. కుక్క శబ్దం విన్నప్పుడు అరవడంతో.. దాని గురించి హ్యాండ్లర్‌ను హెచ్చరిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement