Saturday, November 23, 2024

Train Accident : 48గంట‌ల త‌ర్వాత బ‌తికి బ‌య‌ట‌ప‌డిన వ్య‌క్తి

కోర‌మండ‌ల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదం ఎంతో మంది ప్రాణాలు బ‌లిగొన‌గా..ఆ ప్ర‌మాదం నుండి 48గంట‌ల త‌ర్వాత ఓ వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టం ఆశ్చ‌ర్య‌క‌రం. సహాయం కోరుతూ ఎక్కడి నుంచో పిలుపు వినిపించింది. ఆ శబ్ధం చాలా స్వల్ప స్థాయిలో ఉంది. అస్పష్టంగా ఉన్న ఆ పిలుపునకు సమీపంలో ఉన్న ఓ పోలీసు వెతకడం మొదలు పెట్టాడు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ప్రాంతం అది. పొదల చాటున ఓ వ్యక్తి పడిపోయి కనిపించాడు. నిజానికి అప్పటి వరకు ఆ ప్రాంతాన్ని సహాయ బలగాలు పరిశీలించలేదు. స్వచ్ఛంద కార్యకర్తలతో కలసి బాధితుడిని సోరో కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడ్ని అసోమ్ రాష్ట్రానికి చెందిన దులాల్ మజుందార్ (35)గా గుర్తించారు. తన రాష్ట్రానికే చెందిన మరో ఐదుగురితో కలసి అతడు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో జనరల్ బోగీలో వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. తన తోటి వారు బతికే ఉన్నారా? ఏమయ్యారో కూడా అతడికి తెలియదని చెప్పాడు. ప్రమాదం అనంతరం అతడు ఎగిరి వచ్చి చెట్ల పొదల్లో పడిపోయినట్టు భావిస్తున్నారు. తలకు గాయాలై, మాటల మధ్య పొంతన లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ లోని ఎయిమ్స్ కు తరలించారు. అతడ్ని ప్రస్తుతం పర్యవేక్షణలో ఉంచారు. మజుందార్ మాదిరే మరెవరైనా బాధితులు చెట్ల పొదల చాటున జీవించి ఉన్నారేమోనని అక్కడ మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement