టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా నేడు హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. టీఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నారు. హైటెక్స్‌లో జరగనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీ దృష్ట్యా ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐదు మార్గాల్లో బుధవారం భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
జేఎన్‌టీయూ నుంచి సైబర్ టవర్స్ వైపు, మియాపూర్ నుంచి కొత్తగూడ వైపు, కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ వైపు, జీవవైవిధ్యం నుంచి జేఎన్‌టీయూ వైపు, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధించారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్, సైబర్ టవర్స్-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్-కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని సూచించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంటుందని, ఈ సమయాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.