లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు
వర్షాల్లేక ఎండుతున్న చేలు, పొలాలు
కొత్తూరులో కొనసాగుతున్న సంప్రదాయం
దేవుని గుట్టపై ప్రత్యేక పూజలు
పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం
ఆంధ్రప్రభ స్మార్ట్, ములుగు: వరుణ దేవా, కరుణించావా.. అంటూ ములుగు జిల్లా కొత్తూరులో వరద పాశం కార్యక్రమాన్ని స్థానికులు నిర్వహించారు. రుతు పవనాలు ప్రవేశించినప్పుడు పడిన వర్షాలే తప్పా మరోసారి చినుకులు కురవలేదు. వర్షాలు లేకపోవడంతో వేసిన విత్తనాలు మొలకెత్త లేదు. ఇప్పటికైనా వర్షాలు పడితే తమ పంటలను కాపాడుకుంటామని రైతులు ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వానలు కురవాలని రైతులు దేవుళ్లను ప్రార్థస్తున్నారు. అందులో భాగంగా కొత్తూరు సమీపాన దేవుని గుట్టపై ఉన్న గుడి వద్ద వరదపాశం కార్య్రమాన్ని నిర్వహించారు. ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తోందని చెబుతున్నారు. దేవుని గుట్టపై వంద ఏళ్ల నాటి పురాతన ఆలయ వద్ద ఈ వరదపాశం కార్యక్రామాన్ని నిర్వహించారు.
వరదపాశం ఇలా..
కొత్తూరు గ్రామ రైతులంతా అడవి మార్గంలో దేవుని గుట్టకు చేరుకుంటారు. గుట్టపై ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆవరణలో తమతోపాటు తెచ్చిన బియ్యం, బెల్లం, పాలు, కొబ్బరి కుడుకలతో పాయసం వండుతారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేసి, పాయసం నైవేథ్యంగా పెడతారు. అనంతరం ఆ నైవేథ్యాన్ని బండరాయిపై పోసి అక్కడకు వచ్చిన వారంతా చేతితో తాకకుండా కేవలం నాలికతో మాత్రే స్వీకరిస్తారు. దీన్ని ఏటా ఆచారంగా ఈ ప్రాంతవాసులు నిర్వహిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.