ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ లోని.. అంతరించిపోతున్న జాతులకు చెందిన నీటి పిల్లులు గోదావరి తీరంలో కనిపించాయి. భద్రాచలం–కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద ఇవ్వాల (బుధవారం) వీటిని కొంతమంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే.. ఇవి ఎవరికీ ఎట్లాంటి హాని చేయవని, మత్స్యకారుల వలలను కొరికి చేపలను తింటాయని తెలుస్తోంది. కాగా, ఈ మధ్య కాలంలో ఇట్లాంటి నీటి పిల్లులు కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలో, లక్ష్మీ బ్యారేజీ దగ్గర కూడా కనిపించినట్టు తెలుస్తోంది.
ఇక.. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతం, ఇతర గోదావరి డెల్టా ప్రాంతంలోని మడ అడవుల్లో 115 నీటి పిల్లులను గుర్తించారు. అటవీశాఖ, వన్యమృగ సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గోదావరి డెల్టా మడ అడవుల్లో నీటి పిల్లుల జాడను కనుగొన్నారు. వీరి పరిశోధన ద్వారా అంతరించిపోతున్న జాతులకు చెందిన ఈ నీటిపిల్లులు జాడ దొరకడం చాలా ఆశ్యర్యంగా ఉందని అధికారులు తెలిపారు.