రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో..ఎవరిని ఎవరు కలుస్తారో ఎవరికి తెలియని విషయం. కాగా నిన్నా, మొన్నటి వరకు కత్తులు దూసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కటయ్యారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదంటూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. వెరసి నిన్నటిదాకా తమ మధ్య నెలకొన్న విభేదాలు మటుమాయం అయిపోయినట్టేనని ఇద్దరు నేతలు చెప్పకనే చెప్పారు.టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు నుంచి కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి యత్నించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి అప్పగించడంతో భగ్గుమన్న కోమటిరెడ్డి.. తాను రేవంత్‌ను కలిసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో విభేదాలు చాలానే ఉంటాయని చెప్పిన కోమటిరెడ్డి.. అవన్నీ సర్దుకుంటాయని తాజాగా వ్యాఖ్యానించడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..