తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటన అనంతరం ఎంపీ రేవంత్ రెడ్డి తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు అసంతృప్తి నేతలను బుజ్జగిస్తునే.. మరోవైపు త్వరలో జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ముంగిట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో.. ఇప్పుడు ఆయన స్ట్రాటజీ ఎలా ఉండబోతోందన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తికకరంగా మారింది. తమ బాహుబలి వచ్చాడంటూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే… అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని రేవంత్ ఎలా నిలబెట్టుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
హుజురాబాద్ బైపోల్ కోసం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ? ఏం చేయబోతున్నారు? అన్న చర్చ సాగుతున్న వేళ.. ఊహించని ప్రచారం ఒకటి తెరపైకి వచ్చింది. హుజురాబాద్‌లో ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల బలమైన నేత కావడంతో ఆయన్ను ఎదుర్కోబోయే టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు అన్నది దానిపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి రేసులో ఇప్పటికే అరడజనుకు పైగా నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి . కానీ ఎవరికి ఆ చాన్స్ దక్కుతుందన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థి మాత్రం మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ బంధువైన కౌశిక్‌రెడ్డినే అంటూ ఇప్పటిదాకా ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్‌గా రావడంతో ఇప్పుడు ఆయన టికెట్ ఇవ్వడం అనుమానమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తారన్న ప్రచారం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కరీంనగర్ జిల్లా నుంచి మొదటి నుంచి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు పొన్నం ప్రభాకర్. ఆ మధ్య రేవంత్ నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా యాత్రకు సీనియర్లు ఎవరూ వెళ్లకపోయినా.. పొన్నం ప్రభాకర్ అందులో పాల్గొన్నారు. దీంతో హుజురాబాద్ టికెట్ పొన్నం ప్రభాకర్‌కే ఇచ్చే ఉద్దేశ్యంలో రేవంత్ రెడ్డి ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కౌశిక్ రెడ్డి విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయలు ఉన్నాయి. ఈటల బర్తరఫ్ సమయంలో దేవరయాంజల్ భూములపై కాంగ్రెస్ వద్దన్నా.. కౌశిక్ రెడ్డి మాట్లాడటం, అలాగే ఇటీవల మంత్రి కేటీఆర్‌తో సన్నిహితంగా మెలగడంతో.. ఆయనకు చాన్స్ దక్కడం కష్టమేన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన హయంలో హుజురబాద్ ఉప ఎన్నిక జరగనుండడంతో రేవంత్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి రేవంత్ ఫార్ములా పని చేస్తుందా? హుజురాబాద్‌లో కాంగ్రెస్ గెలుస్తుందా? అన్నది చూడాలి.
ఇదీ చదవండి: కోమటిరెడ్డి కామెంట్లపై స్పందించని ఉత్తమ్