కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బినామీల కోసమే భూముల అమ్మకాలు జరుతున్నాయని అన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందన్నారు. భూముల వేలంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు భూములు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విక్రయిస్తూ పోతే.. చివరకు శ్మశానాలకూ స్థలం దొరకని పరిస్థితులు నెలకొంటాయని రేవంత్ అన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి వెళ్తే కేసీఆర్-హరీష్ రావు- కేటీఆర్ అడ్డుకోని నానా రచ్చ చేశారని గుర్తు చేశారు. ఈ- ఆక్షన్ లో కేసీఆర్ బినామీ కంపెనీలు భూములు దక్కించుకున్నాయని ఆరోపించారు. రూ.3 వేల కోట్లు రావాల్సిన భూములను రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారని పేర్కొన్నారు.
సీఎం సోమేశ్ కుమార్ భూముల గోల్ మాల్ చేశారని ఆరోపించారు. 50 ఎకరాలు ఉన్న భూమి ఒకరానికో రేటు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఒకే గ్రామంలో ఉన్న ఒక్క ఎకరాకు 60 కోట్లు- మిగిలిన 48 ఎకరాలు 30 నుంచి 40 కోట్లకు ఎలా ధర పలుకుతుందని అడిగారు. సిద్దిపేట కలెక్టర్ మిగతా వాళ్ళు ఎవ్వరూ టెండర్లు వేయకుండా ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. టెండర్లు వేస్తే ప్రభుత్వ అనుమతులు ఇవ్వమని హెచ్చరించారు. టీఆరెస్- కేసీఆర్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే భూములు అప్పజెప్పారు!. కోకాపేటలో ఎకరం 50 కోట్లకు తక్కువ ధర లేదన్నారు. అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వబోతోందని తెలిపారు. గతంలో లిక్కర్ మాఫియా, ఇప్పుడు టీఆరెస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు టీఆరెఎస్ ప్రభుత్వం తెరలేపిందన్నారు. 60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమినంతా మళ్ళీ టెండర్లు పిలువాలని రేవంత్ డిమాండ్ చేశారు. స్విచ్ ఛాలెంజ్ విధానం ప్రకారం టెండర్లు పిలులన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దోపిడీ పరాకాష్టకు చేరుకుందన్నారు. తరాల నుంచి వస్తున్న భూములను అమ్మే హక్కు కేసీఆర్ కు లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.