ఎత్తైన ప్రాంతంలో రోప్ వేపై ఒక కేబుల్ కార్ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో అది ముందుకు కదలలేదు. దీంతో అందులో ఉన్న పది మందికి పైగా పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పర్వానూలోని టింబర్ ట్రెయిల్ ప్రైవేట్ రిసార్ట్‌కు చెందిన రోప్ వే మీద వెళ్లే కేబుల్ కార్లు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి. శివాలిక్ పర్వత శ్రేణుల మీదుగా ఇవి ప్రయాణిస్తూ పర్యాటకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. అయితే.. ఇట్లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు మాత్రం పట్టపగలే చుక్కలు చూడాల్సి వస్తోంది అంటున్నారు ప్రయాణికులు.
ఇవ్వాల (సోమవారం) మధ్యాహ్నం 11 మంది పర్యాటకులున్న కేబుల్ కార్ ఎత్తైన కొండ ప్రాంతంలో రోప్ వేపై నిలిచిపోయింది. టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో అది ఎంతకూ ముందుకు కదలలేదు. దీంతో అందులో ఉన్న 11 మంది పర్యాటకులు గంటన్నర పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇందులో ఇద్దరు ఓల్డ్ ఏజ్ పీపుల్, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. భయాందోళన చెందిన వారంతా సహాయం కోసం అర్తనాదాలు చేయడం ప్రారంభించారు.
కాగా, సాంకేతిక బృందం మరో రోప్ వేపై ఆ కేబుల్ కార్ వద్దకు చేరుకుంది. అయితే.. అది కదలలేని పరిస్థితిలో ఉండటంతో చివరకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా అక్కడకి చేరుకున్నారు. రోప్ వేపై చిక్కుకున్న కేబుల్ కార్‌లోని ఇద్దరిని సురక్షితంగా తాళ్ల సహాయంతో కిందకు దించి రక్షించారు. అందులోని ఉన్న మిగతా 9 మందిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. పర్వానూ పోలీసులతోపాటు ఇతర అధికారులు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు.