– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ –1 పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిచెందింది. మరోవైపు ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసింది. ఇక.. ఇవ్వాల జరిగే పోరులో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్లనుంది. ఆదివారం (మే 28) చెన్నైతో టైటిల్ పోరులో తలపడే అవకాశలుంటాయి.
ఇక.. జట్టు బలాబలాల విషయాన్ని పరిశీలిస్తే.. వరుసగా రెండు సెంచరీలు చేసిన గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మాంచి ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా వంటి హిట్టర్లు ఆ జట్టుకు మ్యాచ్ విన్నర్లుగా ఉన్నారు. అంతేకాకుండా నిప్పుల వర్షం కురిపించేలా బంతులతో దాడికి దిగే షమీ, నూర్ అహ్మద్‌ను ఎదర్కోవడం ముంబై బ్యాటర్లకు కష్టమే అంటున్నారు క్రికెట్ అనలిస్టులు.
కాగా.. ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేర వంటి వారు కూడా దంచికొట్టగలరు. బౌలింగ్‌లో ఆకాశ్ మధ్వాల్ సూపర్‌గా రాణిస్తున్నాడు. దీంతో ఇవ్వాల జరిగే మ్యాచ్‌లో మరి గెలిచేది ఎవరు?.. ఫైనల్ పోరులో చెన్నైతో ఆడేది ఎవరు? అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో ఉంది.