Wednesday, November 20, 2024

హుజురాబాద్ లో వారే న్యాయ నిర్ణేతలు!

హుజూరాబాద్ లో రసవత్తర రాజకీయం మొదలైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో నిజయోకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఈటల వర్సెస్ టీఆర్ఎస్ గా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీపై మాటల దాడిని మాజీ మంత్రి ఈటల పెంచారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిన ఓట్లు మాత్రం తనకే పడతాయనే ధీమాలో ఈటల ఉన్నారు. అయితే, ఈటలను రాజకీయంగా, మానసికంగా దెబ్బ కొట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో బీసీ, దళిత ఓటర్లు పోటీలో ఉన్న అభ్యర్ధుల గెలుప ఓటములపై ప్రభావం చూపనున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 2.20 లక్షల ఓటర్లు ఉండగా.. వీరిలో 1.20 లక్షల మంది బీసీ ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గం నుండి 2009 నుండి వరుసగా టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఈటల రాజేందర్ విజయం సాధించారు. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల.. తొలిసారిగా కాషాయ జెండాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు అంటూ హడావిడి చేస్తోంది. ఈ వర్గం ఓట్లు గులాబీ పార్టీకే పడితే.. బీసీ ఓట్లు తనకే ఉంటాయని ఈటల భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న 1.20 లక్షల బీసీ ఓటర్లలో మున్నురు కాపు, యాదవ్, ముదిరాజ్, కుమ్మరి, గౌడ, కురుమ సామాజికవర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

బీసీ సామాజిక వర్గం తర్వాత దళిత సామాజికవర్గానికి చెందిన ఓటర్లున్నారు. హుజురాబాద్ లో సుమారు 50 వేల దళిత ఓట్లు ఉన్నాయి. దళితుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ దళిత బంధు పథకాన్ని తీసుకొస్తోంది.  హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. ఇదే నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే వాసాలమర్రి, హుజూరాబాద్ కు ఈ పథకం కింద నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక, ఈటలను డౌన్ చేయడానికి బీసీల సంక్షేమంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన గెల్లును బరిలో దింపిన గులాబీ దళపతి.. ఇక, బీసీ ఓటర్లను ఆకర్షించే పనిలో బీజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

హుజురాబాద్ నియోజకవర్గంలో 22 వేల మంది రెడ్డి సామాజిక ఓటర్లున్నారు. టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అంతే కాదు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డిని సైతం పార్టీలోచేర్చుకున్నారు. దీంతో రెడ్డి సామాజిక ఓట్లు కూడా గంపగుత్తుగా కారు గుర్తుకే పడతాయనే ధీమాలో కేసీఆర్ ఉన్నారు. ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తులకు కూడా పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈటల చేరికతో ఇప్పటికే బీజేపీ నుంచి చాలా మంది బయటకి వచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించ లేదు. ఒకవేళ అభ్యర్థి ప్రకటిస్తే ఆపార్టీలో ఉండే అసంతృప్తి నేతలను కూడా కారు ఎక్కించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తారా? లేక సెంటిమెంట్ గా భావించిన ఈటల వైపు నిలుస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది. అంతిమంగా ప్రజా తీర్పు ఎలా ఉంటుంది? అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది.

ఇది వార్త కూడా చదవండి: దమ్ముంటే చర్చకు రా.. హరీష్ రావుకు ఈటల సవాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement