₹3 లక్షల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ పెట్టే చాన్స్
గత ఏడాది ₹2.65 లక్షల కోట్ల కేటాయింపులు
మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
400 వందే భారత్‌ల తీసుకొచ్చే అవకాశాలు
10 వందేభారత్ స్లీపర్స్, 100 అమృత్ భారత్ రైళ్లు
అధునాతన రైళ్లను ప్రవేశపెట్టాలనే ఆలోచనలు
68వేల కిలోమీటర్ల మేర ట్రాక్ పెంచే చర్యలు
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
కేటాయింపులపై అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ
ఆశలు పెంచుతూ.. పైపైకి పోతున్న రైల్వే కంపెనీల షేర్లు
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్:
కేంద్ర ప్రభుత్వం రైల్వేల కోసం ఈసారి రూ. 2.93 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ తీసుకురానుంది. రైల్వే మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ డబ్బును వినియోగించనున్నారు. అనేక రైల్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్ పనులు పూర్తవుతాయి. చాలా కొత్త రైల్వే ట్రాక్‌లు పనులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్ పనులన్నీ కంప్లీట్ చేసేందుకు కేంద్ర సర్కారు వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. కాగా, బడ్జెట్‌తో సంబంధం ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ అధికారి ఈ మేరకు బడ్జెట్ అంచనాలపై కొంత సమాచారం ఇచ్చారు. దీంతో రైల్వే బడ్జెట్ కూర్పుపై గతం కంటే అంచనాలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.
400 వందే భారత్ రైళ్లు..
బడ్జెట్ నిధుల ఆధారంగా పెద్ద సంఖ్యలో అధునాతన రైళ్లను కూడా ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 నాటికి, అదనంగా 68,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ను పెంచడంతో పాటు 400 వందేభారత్ రైళ్లను నడపడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ దిశగా పనులు ముందుకు సాగాలంటే రైల్వే బడ్జెట్ కోసం ఎక్కువ మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అయితే.. దీని కోసం జాతీయ రహదారుల అభివృద్ధికి ఇచ్చే మొత్తంలో కోత పెట్టవచ్చు.
కవచ్ ఏర్పాటుకు వేగవంతమైన చర్చలు..
ప్రస్తుతం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఇందులో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల నుంచి రైళ్లలో భద్రత షీల్డ్‌లు (కవచ్) ఏర్పాటు చేసే ప్రాజెక్ట్‌లు అనేకం ఉన్నాయి. ఇంకా, చాలా నగరాల్లో మెట్రో రైలు మార్గాలు కూడా వేస్తున్నారు. ఇది కాకుండా.. 10 వందే భారత్ స్లీపర్ రైళ్లతో పాటు, 100 అమృత్ భారత్ రైళ్లను కూడా ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించవచ్చని అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వీటన్నింటికీ ఈ సారి పద్దులోనే నిధుల కేటాయింపు జరగొచ్చని తెలుస్తోంది.
దూసుకుపోతున్న రైల్వే కంపెనీల షేర్లు..
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైల్వేలకు రూ. 3 లక్షల కోట్లు ఇస్తే.. దాని ప్రత్యక్ష ప్రభావం రైల్ వికాస్ నిగమ్, ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జూపిటర్ వ్యాగన్స్ వంటి రైల్వే సంబంధిత కంపెనీల షేర్లపై కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైల్వే సెక్టార్ మాత్రమే కాకుండా ఫిబ్రవరి 01న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని అన్ని రంగాలకు భారీ అంచనాలే ఉన్నట్టు తెలుస్తోంది.