…..వేతనం కిరికిరి.
..ఉద్యోగ భద్రత కరువు.
..హామీలకే పరిమితం.. అమలుకు దూరం.
..నిరవధిక సమ్మెలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు.
..ఆందోళన ఉధృతానికి కార్యాచరణ
పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 16(ఆంధ్రప్రభ): పెరుగుతున్న నిరుద్యోగం.. ఉన్నత చదువులు చదివినా ఉపాధి అవకాశాలు లేక నిరాశ నిస్పృహలో ఉన్న యువత బతుకుదెరువు కోసం అందివచ్చే ఏ అవకాశాన్నైనా వదులుకోలేదు. ప్రభుత్వాలు ప్రోత్సహించే కాంట్రాక్టు ఉద్యోగాలను సైతం పోటీపడి దక్కించుకున్న యువతకు ఆయా రంగాల్లో ఉద్యోగ భద్రత, పేస్కేల్ అందక వారికి బతుకు భారంగా మారింది. అధికారంలో ఉండే పాలకులు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విపలమవుతూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పి, అధికారంలోకి రాగానే హామీల అమలును విస్మరిస్తున్నారు. పాలకుల ద్వంద వైఖరి నిరుద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం అంటేనే భద్రత లేని వెట్టి చాకిరి నౌకరనే భావన యువతలో నెలకొంది. ఉపాధి కోసం విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకమై పని చేస్తున్న ఉద్యోగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. చాలీ చాలని వేతనాలు, వెట్టి చాకిరీతో సతమతమవుతున్నారు.
పేరుకే ఉద్యోగం కానీ కూలీ కంటే అద్వాన్నంగా మారిందని విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వాపోతున్నారు. భద్రత లేని ఉద్యోగంతో ఆగమవుతున్న తమ డిమాండ్లను పరిష్కరించాలని ఎస్ఎస్ఏ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. నిరసనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్ష అభియాన్ లో పని చేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు గత 7 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎస్ పి డి ఆద్వర్యంలో ఎస్ఎస్ఏ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు ఫలించక పోవడంతో తగ్గేదేలే అనే రీతిలో ఆందోళన మరింత ఉధృతం చేసేందుకు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు.
ఎస్ఎస్ఏ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు
సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగులందరినీ విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి. తక్షణమే పేస్కేల్ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. అందరికీ ఆరోగ్య భీమా, రూ. 10 లక్షలు జీవిత భీమా సౌకర్యం కల్పించాలి. న్యాయపరమైన చిక్కులు ఎదురైతే ప్రభుత్వమే పరిష్కరించి ఎస్ఎస్ఏ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి. అప్పట్లో పీసీసీ అధ్యక్ష హోదాలో ఇచ్చిన హామీని నేటి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలి. తమ డిమాండ్లు పరిష్కరించేలా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు వినతి పత్రం అందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళన
సమగ్ర శిక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 19,325 మంది ఉద్యోగులు టీచింగ్, నాన్ టీచింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లిలో 428 మంది, జగిత్యాలలో 560, రాజన్న సిరిసిల్లలో 445, కరీంనగర్ లో 560 మంది కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. 2011 లో కొంతమంది, 2013 లో మరికొంతమంది నియామకమయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అరకొర వేతనాలతో పని చేస్తున్నారు. వీరిని ప్రతీ ఏడాది రెన్యువల్ చేస్తూ కొనసాగిస్తున్నారు. ఏడాది తరువాత ఉంటదో ఊడుద్దో తెలియని ఉద్యోగానికి విద్యా శాఖలో అధికారులు, క్లస్టర్ హెచ్ఎంల పోరు గుదిబండగా మారింది. ఎస్ఎస్ఏ ఉద్యోగులు అనేక సార్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. నిరవధిక సమ్మెతోనైనా ప్రభుత్వం స్పందించి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హామీ అమలు చేయాలి – తిరుపతి, ఉద్యోగ జెఏసీ జిల్లా అధ్యక్షులు, పెద్దపల్లి
గతంలో పీసీసీ అధ్యక్షునిగా మాకు ఇచ్చిన హామీని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలి. ఏడాదిగా ఎదురు చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆందోళనకు దిగాం. వెనుకడుగు వేసేది లేదు. మా డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తాం.
మా కుటుంబాలు రోడ్డున పడ్డాయ్ – కుంభాల సుధాకర్,
ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సలహాదారు
చాలీ చాలని వేతనాలు, వెట్టి చాకిరితో ఇంకెన్నాళ్ళు పని చేస్తాం. మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నమ్మించి నట్టేట ముంచింది. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనతో మా కుటుంబాలు రోడ్డున పడ్డాయ్. తక్షణమే ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం. డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదు.