Monday, November 25, 2024

Top Story – ఖాకీ డ్రెస్సుకు జీవో క‌ష్టాలు – ఎస్సైల‌కు ప‌న్నెండు ఏండ్లైనా ప‌దోన్న‌తుల్లేవ్‌!

317 జీవోతో ఎస్సైల‌కు తీర‌ని న‌ష్టం
జూనియర్లకూ సెల్యూట్ చేయాల్సి వ‌స్తోంది
చాలా అవ‌మాన‌క‌రంగా ఉంటోంది
బ్యాచ్ ఒక్కటే.. బాధలు మాత్రం కొందరికే
పుష్కర కాలం గడిచినా ప్ర‌మోష‌న్‌ లేదు
స‌బ్ క‌మిటీ చైర్మ‌న్‌, ఉప ముఖ్య‌మంత్రికి విన్న‌పం
సీఎం రేవంత్‌రెడ్డి న్యాయం చేయాలి
317 జీవోని వెంట‌నే తొలగించాలి
వేడుకుంటున్న 2012 బ్యాచ్ ఎస్సైలు

ఆంధ్రప్రభ ప్రతినిధి, పెద్ద‌ప‌ల్లి: వారు పోలీసు ఆఫీస‌ర్లు.. అన్యాయం జ‌రిగింద‌ని ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే ఎంక్లైరీ చేసి న్యాయం చేయాల్సిన బాధ్యత వారిదే.. కానీ, వారికే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేద‌న చెందుతున్నారు. తమ తోటి వారితో పాటు జూనియర్ల కింద పని చేయాల్సిన ప‌రిస్థితికి కుమిలిపోతున్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 317జీవో కొంత‌మంది పోలీసు ఆఫీస‌ర్ల పాలిట శాపంగా మారింది. జీవోతోపాటు జోన్ల మార్పు కూడా దీనికి మరో కారణంగా మారింది. ఫలితంగా 2012లో సెలెక్ట్ అయిన ఎస్ఐల బ్యాచ్‌లో కొందరికి ప్రమోషన్లు రాగా.. మరికొందరికి రాకుండా పోయాయి. నిబంధనల ప్రకారం పోలీస్ శాఖలో ఆరేళ్లకే పదోన్నతి రావాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. పుష్కరకాలం గడిచినా కొంత‌మందికి ఇప్పటికి ప్రమోషన్ రాలేదు. అధికారులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా ప్ర‌యోజ‌నం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి 2012 బ్యాచ్ ఎస్సైలు తమ గోడు వెళ్ల‌బోసుకున్నారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని విన్న‌వించారు..

కొంద‌రికే అన్యాయం..

2012 బ్యాచ్‌కు చెందిన కొందరు అధికారులతో పాటు 2014 బ్యాచ్‌కు చెందిన జూనియర్లు ప్రమోషన్లు పొంది వీరిపై అధికారిగా వారి వద్దకే వస్తుండటంతో గతంలో ఆలయ్ బలయ్ చేసుకునే స్నేహితులకే ఇప్పుడు సెల్యూట్ చేయాల్సి వ‌స్తోంద‌ని మనస్తాపం చెందుతున్నారు. 2012లో ఫిఫ్త్ జోన్ నుంచి 146మంది ఎస్ఐలుగా పోలీస్ శాఖలో చేరారు. ఇందులో 2021లో 46 మంది ఎస్ఐలకు ఇన్‌స్పెక్ట‌ర్లుగా పదోన్నతి కల్పించారు. గతంలో ఫిఫ్త్ జోన్‌లో కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలు ఉండేవి. గత ప్రభుత్వం తెచ్చిన 317జీవోతో మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 గా ఏర్పడ్డాయి. గతంలో ఫిఫ్త్ జోన్ లో ఉన్న ఉమ్మడి జిల్లాలతో పాటు కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట్, మెదక్ జిల్లాలు మల్టీ జోన్ 1 పరిధిలోకి వచ్చాయి. దీనివల్ల కామారెడ్డి, నిజాంబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుండి 66 మంది ఎస్ఐలు ఫిఫ్త్ జోన్ ఎస్ఐల పైన సీనియార్టీలో చేరడంతో పదోన్నతిలో తీవ్ర అన్యాయం జరిగింది.

- Advertisement -

జోన్‌ల ఏర్పాటుతో గంద‌ర‌గోళం..

జోన్‌ల ఏర్పాటు అనంతరం 2012 బ్యాచ్ ఎస్ఐలకు 35 మందికి పదోన్నతి కల్పించారు. వీరితోపాటు 2014బ్యాచ్ కు చెందిన ఇద్దరికి ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. 317 జీవో వల్ల ఆరేళ్లకే దక్కాల్సిన పదోన్నతి 12 ఏళ్లు గడిచిన దక్కకపోవడంతో 65 ఎస్సై లుగానే మిగిలిపోయారు. ఒకే బ్యాచ్ లో ఎంపికైన కొందరికి పదోన్నతి రావడంతో పాటు జూనియర్లకు పదోన్నతి వచ్చి వారిపైనే అధికారిగా రావడంతో సెల్యూట్ కొట్టాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. పాత సీనియార్టీ ప్రకారమే పదోన్నతి కల్పించాలని, 317జీవో వల్ల నష్టపోయామని 65 మంది ఎస్ఐలు పది నెలలుగా పాలకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి విన‌తి చేశారు. ఉన్నతాధికారులను కూడా పలుమార్లు కలిసి తమ బ్యాచ్ కు చెందిన ఎస్ఐలకు పదోన్నతి వచ్చి మూడేళ్లు గడిచిందని, న్యాయం చేసి పదోన్నతి కల్పించాలని వేడుకున్నారు.

సీఎం రేవంత్ దృష్టికి స‌మ‌స్య‌..

తమ సమస్యను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్లాలని, లేదా ముఖ్యమంత్రితో తమకు అపాయింట్మెంట్ ఇప్పించాలని వేడుకున్న లాభం లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం సబ్ కమిటీ రిపోర్టును ఇవ్వడంతో 317 జీవో వల్ల జరిగిన నష్టం సీఎం రేవంత్ దృష్టికి వెళ్ళింది. ఈనెల 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 317 జీవో వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి పాత సీనియార్టీ ప్రకారం తమకు పదోన్నతులు కల్పించాలని 2012 బ్యాచ్‌కు చెందిన 65మంది ఎస్ఐలు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకే బ్యాచ్‌కు చెందిన పలువురికి పదోన్నతి, మరి కొందరికి నష్టం విషయాన్ని ప్రభుత్వం గుర్తించి పదోన్నతి కల్పించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం సమస్యను గుర్తించి 2012 బ్యాచ్ కు చెందిన ఎస్ఐలకు సూపర్ న్యుమరి ద్వారానైనా పదోన్నతి కల్పిస్తే సమస్యకు పరిష్కారం లభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement