Thursday, November 21, 2024

క‌ర్నాట‌క ప్ర‌చారంలో అతిరథులు, అగ్ర‌జులు

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లి ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తిచేశాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు చాలా స్థానాల్లో ముఖా ముఖి తలపడు తున్నాయి. అధికారం నిలబెట్టు కోవాలని కాషాయపార్టీ పట్టుదలతో ఉండగా, అవినీతి బీజేపీని గద్దెదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. 2024 సార్వ త్రిక ఎన్నికలకు ముందు ఈ ఎన్నిక రెండు జాతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ఓటర్ల ను మెప్పించే మేనిఫెస్టోలతోపాటు, వారిని తమ ప్రసంగాలతో మైమరిపించేందుకు ఈ రెండు పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. జనాకర్షణ కలిగిన జాతీయస్థాయి నాయకులతో పాటు, రాష్ట్ర ప్రముఖులతో ప్రచారాన్ని హోరె త్తించబోతు న్నారు. ఇప్పటికే రెండు పార్టీలు 40 మంది చొప్పున ప్రముఖులతో స్టార్‌క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించి కీలక అంకానికి తెరలేపాయి.

మోడీ మానియాపైనే ఆశలు..
భారతీయ జనతాపార్టీ 40 మందిని స్టార్‌ క్యాంపెయినింగ్‌కు ఎంపిక చేసింది. వీరిలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తోపాటు రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, మన్సుఖ్‌ మాండవీయ వంటి పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ అతిరథులు ఉన్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ ప్రముఖులు బిఎస్‌ యెడియూరప్ప, నలిన్‌ కుమార్‌ కతీల్‌, బస్వరాజ్‌ బొమ్మై, ప్రహ్లాద్‌జోషి, సదానందగౌడ, కేఎస్‌ ఈశ్వరప్ప, సీటీ రవి, ఆర్‌ ఆశోక, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అసోం, మహారాష్ట్ర, కేరళ, గోవా, తమిళనాడులోని బీజేపీ, అనుబంధ సంస్థల బృందాలు ఇప్పటికే కర్ణాటక చేరుకున్నాయి. నేరుగా ఓటర్లను కలుసుకుని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాయి. కర్ణాటకతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల బృందాలు విస్తృతంగా పర్యటిస్తున్నాయి. తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలోని తెలుగు వారిని తమవైపు తిప్పుకునేందుకు, బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ ప్రముఖలను ప్రచారానికి ఆహ్వానించింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు, ఎంపీలు, లక్ష్మణ్‌, అర్వింద్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, జితేందర్‌రెడ్డి, గరికపాటి, ఇంద్రసేనారెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.

కాంగిరేస్‌ దూకుడు..
ఇప్పటికే సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్‌ సమరోత్సాహంతో ఉరకలేస్తోంది. బీజేపీకి దీటుగా ప్రచారానికి ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీ, మల్లికార్జువన్‌ ఖర్గే తోపాటు జనాకర్షక నేతలను రంగంలోకి దించుతోంది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌, భూపేష్‌ బాఘెల్‌, సుఖ్‌విందర్‌ సుఖుతోపాటు మాజీ కేంద్రమంత్రులు చిదంబరం, జైరాం రమేష్‌, శిశిథరూర్‌, కన్నడ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, మాజీ సీఎం జగదీశ్‌ షెట్టార్‌, వీరప్ప మొయిలీ, ఎంపీ పాటిల్‌, సతీష్‌ జార్కిహోలి తదితరులు 40 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. రాహుల్‌ గాంధీ ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యారు. రాబోయే 20 రోజుల్లో ఆయన ఏకంగా 20 ర్యాలీల్లో పాల్గొననున్నారు.

- Advertisement -

పదునైన నినాదాలు..
ప్రచారంలో బీజేపీ అధికార దుర్వినియోగాన్ని, అసమర్థతను ఎండగట్టేలా నినాదాలు కూడా సిద్ధంచేసుకుంది. ముఖ్యంగా 40శాతం కమిషన్‌ ప్రభుత్వం, నందిని మిల్క్‌ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సంకల్పించింది. అదే సమయంలో ఓబీసీ రిజర్వేషన్ల కోటా విషయంలోనే బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలను దెబ్బకొట్టాలని వ్యూహం పన్నింది. ఇక పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకైన దళితులు, గిరిజనులను తమవైపు తిప్పుకోవడం ద్వారా కనీసంగా 150 స్థానాలను నెగ్గాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement