Friday, November 22, 2024

రేపే గులాబీ పండుగ, ప్లీనరీకి ముస్తాబైన భాగ్యనగరం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) 21వ ఆవిర్భావ వేడుకకు రాజధాని హైదరాబాద్‌ నగరం ముస్తాబైంది. ప్లీనరీ జరగనున్న హైదరాబాద్‌ ఐటీకారిడార్‌లోని హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలన్నీ గులాబీ రంగు సంతరించుకున్నాయి. ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధులను ఆహ్వానిస్తూ భాగ్యనగరం నలువైపులా గులాబీ తోరణాలు వెలిశాయి. ప్లీనరీ కోసం పార్టీ ప్రత్యేకంగా నియమించిన అలంకరణ కమిటీ, తీర్మానాల కమిటీ, భోజనాల కమిటీ, మీడియా కమిటీ, పార్కింగ్‌ కమిటీ తదితర కమిటీలు యుద్ధ ప్రాతిపదికన పనిచేసి ప్లీనరీ ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేశాయి. పార్టీ నుంచి ఆహ్వానాలు వెళ్లిన ప్రతినిధులు మాత్రమే హాజరవనున్న ప్లీనరీ వేదిక నుంచి గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్లీనరీలో ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 11 రకాల తీర్మానాలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరు శంఖం పూర్తిస్తూ ఆ మేరకు కూడా ప్రత్యేక తీర్మానాలు ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆదేశాల ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులంతా సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. 11 గంటలకు పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ జెండా ఎగురవేస్తారు. సీఎం తొలిపలుకుల అనంతరం సాయంత్రం 5 గంటల దాకా ప్లీనరీ కొనసాగనుంది.

హాజరవనున్న 3 వేల మంది ప్రతినిధులు… ప్రత్యేక వంటకాలతో విందు
రాష్ట్ర మంత్రివర్గం, రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంస్‌ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కో ఆర్డినేటర్లు, జెడ్పీటీసీ సభ్యులు, మునిసిపల్‌ మేయర్లు, చైర్మన్లు, మండల పరిషత్‌ అధ్యక్షులు,పట్టణాలు, మండల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు తదితర ప్రతినిధులు మొత్తం 3 వేల మంది దాకా ప్లీనరీకి హాజరవనున్నారు. ప్లీనరీకి హాజరవనున్న ప్రతినిధులు, మహిళా ప్రతినిధులు, మీడియా సిబ్బంది తదితరుల కోసం ప్రత్యేకంగా భోజన స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంప్రదాయ, ఇతర ప్రత్యేక వంటకాలను ప్రతినిధుల కోసం సిద్ధం చేసేందుకుగాను అన్ని ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణమైన హెచ్‌ఐసీసీ రాజధాని నగరంలోని రద్దీ ప్రాంతమైన ఐటీ కారిడార్‌లో ఉండడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement