Tuesday, November 19, 2024

నేడు బయో ఏసియా సదస్సు.. ఫ్యూచర్‌ రెడీ థీమ్‌, కేటీఆర్‌తో బిల్‌గేట్స్‌ ప్రత్యేక చర్చ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బయోటె క్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో అతిపెద్ద సదస్సు అయిన బయో ఆసియా19వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ఈ గ్లోబల్‌ సదస్సును గురు, శుక్ర వారాల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో 70కిపైగా దేశాల నుంచి 30వేల మంది లైఫ్‌ సైన్సెస్‌ ప్రతినిధులు పాల్గొననున్నారు. 7 ప్యానెళ్ల నుంచి 50 మంది స్పీకర్లు ప్రసంగించనున్నారు. వీటిలో 2 కీనోట్‌ ప్రసంగాలున్నాయి. ఈసారి వర్చువల్‌ విధానంలో సదస్సు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది ‘ఫ్యూచర్‌ రెడీ’ థీమ్‌తో నిర్వహించనున్న సదస్సులో ప్రభుత్వం, ఇండస్ట్రీ, అకాడమీల నుంచి లైఫ్‌ సైన్సెస్‌ ప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో లైఫ్‌ సైన్సెస్‌ రంగ ప్రస్తుత గమనం, సవాళ్లు, భవిష్యత్తులో వృద్ధి అవకాశాలపై తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు హబ్‌గా ఎదుగుతోన్న హైదరాబాద్‌ నగర జైత్రయాత్రలో బయో ఆసియా సదస్సు కీలకపాత్ర పోషిస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ సత్తా చాటేందుకు ఇదొక చక్కని వేదిక అని పేర్కొంటూ బయో ఆసియా 2022 సదస్సులో పాల్గొనే ప్రతినిధులకు మంత్రి స్వాగతం పలికారు.

ప్రసంగించనున్న మైక్రోసాఫ్ట్‌, మెడ్‌ట్రానిక్‌ సీఈవోలు..
ఆసియా అతిపెద్ద లైఫ్‌సైన్సెస్‌ రంగ వార్షిక బయో ఏసియా సదస్సులో పలువురు ప్రముఖ కంపెనీల సీఈవోలు ప్రసంగించనున్నారు. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. సదస్సు రెండో రోజైన శుక్రవారం కొవిడ్‌ నేర్పిన పాఠాలపై మంత్రి కేటీఆర్‌తో కలిసి గేట్స్‌ ఫైర్‌ సైడ్‌ చాట్‌లో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగం బలోపేతంపై వీరిరువురు చర్చించనున్నారు. తొలిరోజు సదస్సులో నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ పాల్గొని తన సందేశాన్ని వినిపించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం, బయోఏసియా ఫోరం సంయుక్తంగా బయోఏసియా సదస్సును నిర్వహిస్తున్నాయి. వర్చువల్‌ పద్ధతిలో జరగనున్న ఈ సదస్సులో ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ చైర్మన్‌ అలెక్స్‌ గొరోస్కీ, మెడ్‌ట్రానిక్‌ సీఈవో జెఫ్‌ మార్తా తదితర ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగానికి చెందిన దిగ్గజ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement