టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో ఈడీ వేగం పెంచింది. బుధవారం ఈడీ విచారణకు హీరో తరుణ్ హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో తరుణ్‌కు ఈడీ నోటీసులిచ్చింది. అనుమానాస్పద లావాదేవీలపై, కెల్విన్ సంబంధాలపై తరుణ్‌ను ప్రశ్నించే అవకాశముంది. తరుణ్ నమునాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్‌ఎల్ నివేదికలో తేలింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికల ప్రకారం తరుణ్‌కు ఎక్సైజ్‌శాఖ క్లీన్‌చిట్ ఇచ్చింది.
డ్రగ్స్ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులిచ్చింది. ఇప్పటికే దర్శకుడు పూరిజగన్నాథ్ సహా హీరోలు రానా, రవితేజ, నందు, చార్మి, రకుల్ ప్రీత్‌సింగ్, ముమైత్‌ఖాన్, తనీష్, నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్ హరిప్రీత్‌సింగ్, డ్రైవర్ శ్రీనివాస్‌ను అధికారులు ప్రశ్నించారు. మత్తు మందు సరఫరాదారులు కెల్విన్, జీషాన్‌లను కూడా విచారించారు. వీరి బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించారు.
కాగా, ఎక్సైజ్ సిట్ నుంచి తీసుకున్న నివేదిక ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎక్సైజ్ సిట్ మాత్రం సినీ రంగానికి చెందిన వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. సినీ నటులు, హోటల్స్, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇవ్వగా… దాని ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్ ఛార్జీలు!