టోక్యో ఒలింపిక్స్ లో భారతీయ రెజ్లర్లు దీపక్ పూనియా, రవి దహియా సత్తా చాటుతున్నారు. ఈ ఇద్దరు కూడా సెమీస్ లో కి ఎంటరయ్యారు. 86 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో దీపక్ పూనియా సెమీస్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్స్‌లో అతను చైనాకు చెందిన రెజ్లర్ సుషెన్ లిన్‌పై 6-3 స్కోర్‌తో దీపక్ గెలిచాడు. అంతకుముందు ఇవాళ ఉదయం ప్రీ క్వార్టర్స్‌లో నైజీరియా రెజ్లర్ ఎకెరికెమి అగియోమోర్‌ను ఓడించాడు. టెక్నికల్ సుపీరియార్టీ పద్ధతిలో 12-1 స్కోర్ తేడాతో బౌట్‌ను దీపక్ గెలుచుకున్నాడు. మహుహరి మెస్సి స్టేడియంలో జరిగిన రెజ్లింగ్ పోటీలో.. దీపక్ పూనియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బ్రేక్ సమయంలో ఇండియన్ రెజ్లర్ 4-1 తేడాతో లీడ్‌లో ఉన్నాడు. ఇక సెకండ్ పీరియడ్‌లో తన వేగాన్ని మరింత పెంచేశాడు. సెమీస్‌లో డేవిస్ మోరిస్‌తో దీపక్ తలపడనున్నాడు.
57 కేజీల మెన్స్ ఫ్రీస్టయిల్ క్వార్టర్స్‌లో బల్గేరియాకు చెందిన జార్జి వంజెలోవ్‌పై 14-4 స్కోర్‌తో రవికుమార్ దహియా విజయం సాధించి సెమీస్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఇవాళ జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో కొలంబియా రెజ్లర్ ఆస్కార్ టిగ్రిరోస్‌పై రవి విజయం సాధించాడు. 23 ఏళ్ల రవికుమార్ తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాడు. మొదటి మ్యాచ్‌లో ప్రతి రౌండ్‌లోనూ రవికుమార్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బౌట్‌ను 13-2 స్కోర్ తేడాతో దహియా మ్యాచ్‌ను గెలిచాడు. 57 కేజీల పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్.. ఆసియా చాంపియన్. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన దహియా.. కొలంబియా రెజ్లర్‌ను వత్తిడిలో పెట్టాడు. సెకండ్ పీరియడ్‌లో టెక్నికల్ సుపీరియార్టీతో మ్యాచ్‌ను 13-2 తేడాతో కైవసం చేసుకున్నాడు. సెమీస్‌లో కజికిస్తాన్‌కు చెందిన నూర్ ఇస్లామ్ సనియోతో రవికుమార్ తలపడనున్నాడు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.45కు జరుగుతుంది.
ఇది కూడా చదవండి: Semi Final: అర్జెంటీనాతో తలపడనున్న భారత మహిళల హాకీ జట్టు..