కరోనా మహమ్మారి క్రీడలను కూడా వదలడం లేదు. కరోనా కారణంగా ఇప్పటికే ఐపీఎల్ వంటి మెగా టోర్నీ నిరవధిక వాయిదా అయితే మరో మెగా ఈవెంట్ కూడా కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓసారి వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. కేసుల వృద్ధితో టోక్యో, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో విధించిన స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని పొడిగించాలని జపాన్ ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో జూలై 23న ప్రారంభం కావాల్సి ఉన్న టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.
గత ఏడాది జులై 22న ప్రారంభం కావాల్సిన ఒలింపిక్స్ క్రీడలు కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జులై 23 నుంచి అగస్టు 8 వరకు ఒలింపిక్స్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం జపాన్ కరోనా సెకెండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్నది. దీంతో టోక్యో సహా ప్రధాన నగరాల్లో విధించిన ఎమర్జెన్సీని పొడిగించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో గత నెలలోనే ఎమర్జెన్సీ విధించారు. ఇప్పుడు టోక్యో, ఒసాక, క్యోటో, హ్యూగో నగరాల్లో మే 11 వరకు ఎమర్జెన్సీని పొడిగించారు. అయితే వారం తర్వాత కూడా కరోనా కేసులు తగ్గక పోతే మరిన్ని రోజులు ఎమర్జెన్సీని కొనసాగించే అవకాశం ఉన్నట్లు జపాన్ ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఇలాగే కొనసాగితే ఆ ప్రభావం ఒలింపిక్స్‌పై కూడా పడే అవకాశం ఉంటుందని.. చివరకు రద్దు చేయాల్సి వస్తుందేమో అని అధికారులు అనుమానిస్తున్నారు.