Tuesday, November 26, 2024

నేడు భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మూడో టీ20.. క్లీన్‌స్వీప్‌పై భారత్‌ నజర్..

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఆదివారం కోల్‌కతా వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా రాత్రి 7గంటలకు సిరీస్‌లోని చివరి టీ20లోనైనా గెలవాలని పర్యాటక విండీస్‌ జట్టు ఆశిస్తోంది. మరోవైపు ఇప్పటికే 2-0తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్‌సేన మూడో టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. వన్డే సిరీస్‌లో 3-0తేడాతో భారత్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైన వెస్టిండీస్‌ కనీసం టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో నైనా గెలిచి ఊరట పొందాలని కోరుకుంటుంది. అయితే ఆదివారం జరిగే మూడో టీ20లో భారత్‌ ప్రయోగాలు చేసేందుకు సిద్ధపడుతోంది. దీనిలోభాగంగా విరాట్‌కోహ్లీ, రిషభ్‌పంత్‌లకు 10రోజులపాటు విశ్రాంతినిచ్చింది.

ఆతిథ్య భారత్‌ తుదిజట్టులో రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు లభించనుంది. కాగా రోహిత్‌శర్మ కెప్టెన్సీలో భారత్‌ వరుసగా మూడో సిరీస్‌ను గెలుచుకోవడం విశేషం. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఈనేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ రిజర్వ్‌ ఓపెనర్‌ కోసం ప్రయోగాలు చేయనున్నాడు. కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరుతో అతడి స్థానాన్ని భర్తీ చేసిన ఇషాన్‌కిషన్‌ ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్‌లో 42బంతుల్లో 35పరుగులు చేసిన ఇషాన్‌ రెండో మ్యాచ్‌లో 10బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో బెంచ్‌కే పరిమితమైన గైక్వాడ్‌ నేడు బరిలో దిగనున్నాడు.

టీ20జట్టు : రోహిత్‌శర్మ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌, సంజూశాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, దీపక్‌హుడా,రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దిప్‌యాదవ్‌, రవిబోష్ణోయ్‌, సిరాజ్‌, బుమ్రా (వైస్‌కెప్టెన్‌), భువనేశ్వర్‌, హర్షల్‌పటేల్‌,అవేశ్‌ఖాన్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement