ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవ్వాల (శుక్రవారం) యాదాద్రి వెళ్తున్నారు. సతీసమేతంగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం సమర్పించనున్నారు. దీనికిగాను రోడ్డు మార్గం గుండా ప్రగతిభవన్ నుంచి బయల్దేరి యాదాద్రికి చేరుకోనున్నారు. ఉదయం గం. 11.30 గంటలకు యాదాద్రిలోని ప్రెసిడెన్షియల్ సూట్ కు సీఎం దంపతులు చేరుకుంటారు.
ఇక.. అక్కడి నుంచి స్వామి వారిని దర్శించుకుని సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మరికొందరు స్వర్ణతాపడానికి బంగారం విరాళంగా అందజేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మధ్యాహ్నం ఆలయంలో భోజనం చేసిన తర్వాత 3.30గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ యాదాద్రికి వెళ్లడం ఇది 21వ సారి కావడం గమనార్హం.
ఇక.. జాతీయ పార్టీ ప్రకటించే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్.. యాదాద్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు నారసింహుడిని దర్శించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 5వ తేదీన జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే రోజు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంతో పాటు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కాబోతుండటం దీనికి మరింత బలం చేకూరుస్తోంది.