Thursday, November 21, 2024

బొగ్గు స‌ప్ల‌య్‌లో స్పీడ్ పెంచేందుకు.. 42 ప్యాసింజర్ రైళ్లు రద్దు

వేసవి కాలం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యుత్‌ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్‌ ఉత్పత్తితోపాటు దానికి కావాల్సిన బొగ్గుకు బాగా డిమాండ్‌ ఏర్పడింది. దేశంలోని పలు థర్మల్‌ విద్యుత్ కేంద్రాంల్లో బొగ్గు నిల్వలు బాగా త‌గ్గిపోయాయి. దీంతో పలు రాష్ట్రాల్లో పవర్‌ కట్ విధించాల్సి వ‌స్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం త‌లెత్తుతోంది. ఢిల్లీలో మెట్రో రైళ్లు, ప్రభుత్వ హాస్ప‌ట‌ళ్ల‌పై బొగ్గు ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లకు అత్యవసరంగా బొగ్గు సరఫరాపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

గూడ్స్‌ రైళ్లలో వేగంగా బొగ్గు రవాణా చేసేందుకు దేశంలోని పలు మార్గాల్లో 42 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసిన‌ట్టు తెలుస్తోంది. యుద్ధ ప్రతిపాదికన బొగ్గు రవాణా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత తీరగానే రద్దు చేసిన 42 ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. మరోవైపు బొగ్గు రవాణా రైళ్ల వేగవంతం కోసం ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం 3 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. అయితే స్థానికులతోపాటు ఎంపీలు నిరసనకు దిగడంతో వాటిని పునరుద్ధరించారు.

కాగా, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) రోజువారీ బొగ్గు స్టాక్ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 165 థర్మల్ పవర్ స్టేషన్లలో సుమారు 56 ప్లాంట్లలో 10 శాతం లేదా అంతకంటే తక్కువ బొగ్గు నిల్వలున్నాయి. అలాగే 26 థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో ఐదు శాతం కంటే తక్కువగా బొగ్గు స్టాక్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement