Sunday, November 24, 2024

గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ఫేజ్‌ 2కు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రాల మధ్య విద్యుత్‌ పంపిణీని మరింత సులభతరం చేయడంతో పాటు సంప్రదాయేతర ఇంధన వనరులతో పూర్తిస్థాయిలో పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఉద్దేశించిన ‘గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌’ 2వ విడత పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, రూ.12,031 కోట్లతో అమలుకానున్న ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. ఇప్పుడున్న విద్యుత్‌ సరఫరా లైన్లకు అదనంగా 27,500 మెగా వోల్ట్‌ యాంపియర్స్‌ సామర్థ్యంతో సబ్‌ స్టేషన్లు, 10,750 సర్క్యూట్‌ కి.మీ మేర కొత్త ట్రాన్స్ మిషన్‌ లైన్లను నిర్మించనున్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక, కేరళ, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో నిర్మించిన 20 గిగావాట్ల సామర్థ్యం కల్గిన పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులను గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు.

మొత్తం రూ.12,031.33 కోట్ల ఖర్చుతో అమలుకానున్న ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటాగా 33శాతం అంటే రూ.3,970.34 కోట్ల నిధులను కేంద్రం సమకూర్చనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 5 ఏళ్ల కాలంలో విద్యుత్‌ పంపిణీ లైన్లను నిర్మించి 2025-26 నాటికి పూర్తిచేసేలా పథకాన్ని రూపొందించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం కారణంగా అంతర్రాష్ట్ర పంపిణీ చార్జీలు తగ్గి, అంతిమంగా వినియోగదారుడికి ఊరట కల్గుతుందని కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.2030 నాటికి 450 గిగావాట్ల సామర్థ్యం కల్గిన పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించి నట్టు కేంద్రం తెలిపింది. కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ పర్యావర ణానికి హాని కలగని రీతిలో గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి సాధన కోసం ఈ పథకం ఉద్దేశించినట్టు కేంద్రం పేర్కొంది. మరోవైపు భారీ ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ‘గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ఫేజ్‌-1’కు ఇది అదనమని స్పష్టం చేసింది. 2022 నాటికి 24 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీని గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నట్టు వెల్లడించింది. ఫేజ్‌-1లో భాగంగా 22,600 ఎంవీయే సామర్థ్యం కల్గిన సబ్‌ స్టేషన్లు, 9,700 సర్క్యూట్‌ కిలోమీటర్ల మేర విద్యుత్‌ పంపిణీ లైన్ల నిర్మాణం జరుగుతోందని, మొత్తం రూ.10,141.68 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపింది.

భారత్ నేపాల్ మధ్య మరో వారధి..

భారత్‌, నేపాల్‌ సరిహిద్దుల మధ్య మహాకాళి నదిపై వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దార్చులా వద్ద ఈ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. భారత్‌-నేపాల్‌ దేశాల మధ్య ఫ్రీబోర్డర్‌ విధానంలో ఎలాంటి వీసా అవసరం లేకుండా రాకపోకలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకేరకమైన సంస్కృతి, సాంప్రదాయాలు కల్గిన రెండు దేశాల మధ్య సంబం ధాలను మరింత ధృడం చేసుకునే క్రమంలో భాగంగా రెండు దేశాలను కలిపే వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతులను రెండు దేశాలూ అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దార్చులా వద్ద వంతెన నిర్మాణానికి భారత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement