ప్రముఖ షో నిర్మాత, ప్రాజెక్ట్ హెడ్ తనను లైంగికంగా వేధించారని ‘‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’’ నటి జెన్నిఫర్ బన్సీవాల్ మిస్త్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్మాత అసిత్ కుమార్ మోడీ, కొంతమంది సిబ్బందిపై తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేసింది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ షోలో రోషన్ సింగ్ సోధి పాత్రను పోషిస్తున్న జెన్నిఫర్ మిస్త్రీ, ఆ షో నిర్మాత, ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్‌పై లిఖితపూర్వకంగా పోలీసులకు కంప్లెయింట్ చేసింది. అయితే.. ఈ విషయంలో ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, కానీ.. పోలీసులు మాత్రం విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వ్యక్తుల వాంగ్మూలాన్ని త్వరలో నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఈ ఆరోపణలపై అసిత్ మోడీ ఏమన్నారంటే..
లైంగిక వేధింపుల ఆరోపణలపై అసిత్ మోడీ స్పందించాడు. వాటిని నిరాధారమైనవిగా కొట్టిపడేశాడు. ఆమె తన పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పాడు. ఆమెకు సెట్లో ప్రాథమిక క్రమశిక్షణ లేదని, పనిపై దృష్టిపెట్టకుండా ఇష్టమున్నట్టు ప్రవర్తించిందని తెలిపాడు. తాము ఆమె ప్రవర్తన గురించి ప్రొడక్షన్ హెడ్‌కి ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేశామన్నాడు. ఇక.. చివరి రోజు యూనిట్ ముందు తనను బండ బూతులు తిట్టిందని, అంతేకాకుండా షూటింగ్ పూర్తి చేయకుండానే సెట్ నుండి వెళ్లిపోయిందని అసిత్ మోడీ వెల్లడించాడు.
అంతేకాకుండా.. షూట్ నుండి బయటకు వెళ్లేటప్పుడు ఆమె తన దారికి అడ్డుగా ఉన్న వ్యక్తులను పట్టించుకోకుండా చాలా వేగంగా తన కారును బయటకు తీసిందని అసిత్ మోడీ చెప్పాడు. సెట్ ఆస్తిని కూడా పాడు చేసిందని, దీంతో తాము ఆమె ఒప్పందాన్ని రద్దు చేయాల్సి వచ్చిందన్నాడు.. షూటింగ్ సమయంలో ఆమె చెడు ప్రవర్తన, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో తాను USAలో ఉన్నానని అసిత్ తెలిపాడు. అయితే.. తాను ఆమెపై లైంగిక దాడి చేశానని ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేస్తూ తమను, ప్రదర్శనను అప్రతిష్టపాలు చేయడానికి యత్నిస్తోందన్నాడు. ఈ నిరాధార ఆరోపణలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. ఆమె తనతోపాటు షో పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నందున చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మీడియాకు తెలిపాడు.