Wednesday, November 20, 2024

Private Schools: తిరుపతిరావు కమిటీ సిఫార్సులే బెటర్​.. ఫీజుల నియంత్రణపై కొత్త కమిటీలొద్దు!

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్‌ స్కూల్‌ ఫీజుల నియంత్రణపై కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ అంశంపై త్వరగా ఏదోక స్పష్టత ఇవ్వాలని.. ఇక నాన్చొద్దని ప్రైవేట్‌ స్కూల్స్‌ మేనేజ్మెంట్లు డిమాండ్‌ చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణ పేరుతో కొత్త కమిటీలు వేయొద్దని పేర్కొంటున్నాయి. పాత కమిటీ సిఫార్సులనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కొత్త కమిటీలు వేయడం ద్వారా మరింత కాలయాపన జరుగుతుందని యాజమాన్యాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఫీజుల నియంత్రణపై గతంలో ప్రొఫెసర్‌ తిరుపతి రావు కమిటీ చేసిన సిఫార్సులనే ప్రస్తుతం అమలు చేయాలని ప్రైవేట్‌ స్కూల్స్‌ అంటుంటే.. పేరెంట్స్‌ అసోసియేషన్‌లు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. తిరుపతి రావు కమిటీ సిఫార్సులు ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాలకు మేలు చేసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ఫీజుల పెంపు విషయంలో తిరుపతి రావు కమిటీ కేవలం సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని ఎక్కడా చెప్పలేదని అంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు మేలు జరిగేలా నిర్ధిష్టమైన ఫీజును స్కూళ్లు వసూలు చేసే విధంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పేరెంట్స్‌ కోరుతున్నారు.

ఇదిలా ఉంటే ఫీజుల వసూళ్లలో కొన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థలు చేసే ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేయడంలో ప్రైవేట్‌ విద్యా సంస్థలు అస్సలు వెనకాడవు. ఇదే తరహా వసూళ్లు కరోనా సమయంలోనూ వసూలు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అప్పట్లో 30 శాతం ఫీజును తగ్గించి నెలవారీగా మాత్రమే ట్యూషన్‌ ఫీజులు వసూలు చేయాలని, ఈ ఆదేశాలను ప్రతి ఒక్క స్కూల్‌ కచ్చితంగా పాటించాలని అప్పట్లో 46, 75 జీవోలను విడుల చేసింది.

అయినా కానీ కొన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఈ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ తమ పనిని తాము చేసుకుంటూ పోయాయి. స్కూలుకు పోని విద్యార్థుల నుంచి కూడా ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేశాయి. ఇంకా చేస్తునే ఉన్నాయి. ఈ క్రమంలో ఫీజుల నియంత్రణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఫీజులను నియంత్రించేందుకు పటిష్టమైన చట్టాన్ని తీసుకురాబోతున్నది. స్కూళ్లు, ఇంటర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకూ వర్తించే విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేయనున్నట్లు తెలిసింది. ఇందుకూ తిరుపతి రావు కమిటీతో పాటు ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజుల విధానాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. కొత్త కమిటీ కూడా వేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పాత కమిటీ ఇచ్చిన నివేదిక చాలని..ఇంకా కొత్త కమిటీలు ఎందుకని తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనెజ్మెంట్స్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది. త్వరలోనే ఫీజుల నియంత్రణపై చర్చించేందుకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్‌ రావు, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌తో కూడిన మంత్రుల కమిటీ సమావేశం కానున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన బిల్లును త్వరలో జరిగే అసెంబ్లి సమావేశాల్లో పెట్టాలని ప్రభుత్వం యోచిస్త్తున్నట్లు సమాచారం.

- Advertisement -


కొత్త కమిటీలతో కాలయాపనే: యాదగిరి శేఖర్‌ రావు, ట్రస్మా అధ్యక్షుడు
ఫీజుల నియంత్రణపై తిరుపతి రావు కమిటీ సూచించిన సిఫార్సులనే అమలు చేయాలి. ఫీజుల విషయంలో ఇప్పటికే ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇంకా కొత్త కమిటీలు ఎందుకు. ఫీజుల నియంత్రణ పేరుతో కొత్త కమిటీలు వేయడమనేది కాలయాపనే అవుతుంది తప్పా మరొకటి కాదు. తిరుపతి రావు కమిటీ తన నివేదికను ఇవ్వడానికి అప్పట్లో రెండున్నరేళ్ల సమయం పట్టింది. మళ్లిd కొత్త కమిటీ వేస్తే ఇంకెన్నేళ్లు పడుతుందో తెలియదు. అందుకే గతంలో ఇచ్చిన కమిటీ సిఫార్సులనే స్కూళ్లకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఫీజుల నియంత్రణ విషయంలో మార్గదర్శకాల రూపకల్పనలో తమ సంఘానికి అవకాశం ఇవ్వాలని ఈమేరకు విద్యాశాఖ మంత్రిని కలిసి కోరినట్లు ఆయన తెలిపారు.

విద్యా వ్యాపారాన్ని ఆపాలి: వెంకట సాయినాథ్‌, హెచ్‌ఎస్‌పీఏ
విద్యా వ్యాపారాన్ని ఆపాలి. స్కూళ్లలోని సౌకర్యాలు, అర్హతగల స్టాఫ్‌ని బట్టి ఫీజులు వసూలు చేయాలి. తిరుపతి రావు కమిటీ సూచనలు మాత్రమే చేసింది. అవే అమలు చేయాలని చెప్పలేదు. తిరుపతి రావు కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి. ప్రతి ఏడాది 10 శాతం ఫీజు పెంచుకోవచ్చనేది కేవలం సిఫార్సు మాత్రమే. కానీ దీనికి విరుద్దంగా ప్రైవేట్‌ విద్యా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రైవేట్‌ స్కూళ్లకు లాభం చేసేలా విద్యార్థుల తల్లిదండ్రులకు భారం కలిగించేలా ఉంది. ఫీజుల నియంత్రణ మార్గదర్శకాల రూపకల్పనలో పేరెంట్స్‌ అసోసియేషన్‌ సూచనలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.

కార్పొరేట్‌ విద్యా వ్యాపారాన్ని కట్టడి చేయాలి: గౌరీ సతీష్‌, తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల సంఘం
కార్పొరేట్‌ విద్యా వ్యాపారాన్ని కట్టడి చేయాలి. ఎంపీసీ, బైపీసీ ఇలా గ్రూపుల వారీగా నిర్ధిష్టమైన ఫీజులను రూపొందించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా ఫీజులను నిర్ధారించాలి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఫీజులు ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వం ఎవరి మీద భారం పడకుండా కచ్చితమైన ఫీజు విధానాన్ని తీసుకురావాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement