ఏపీలోని తిరుపతి, తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 31న నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఏప్రిల్ 17న సాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు. మే 2న తిరుపతి, సాగర్ ఉపఎన్నిక ఫలితాలు రానున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ పోటీ చేయనున్నారు. ఈనెల 24న ఆమె నామినేషన్ వేయనున్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. అటు సాగర్ ఉపఎన్నిక విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్ధిగా జానారెడ్డిని ఇప్పటికే ప్రకటించగా, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థిపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ వివిధ సామాజిక సమీకరణలు, లెక్కలు పరిశీలిస్తోంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,19,745 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,08,907 మంది పురుషులు ఉండగా.. 1,10,838 మంది మహిళలు ఉన్నారు.