Tuesday, November 26, 2024

గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, రైతుల బ‌లోపేతంకు అవిశ్రాంత కృషి : రామ్ నాథ్ కోవింద్

దేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, రైతులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ…. రికార్డు స్థాయిలో ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోళ్లను చేపట్టిందన్నారు. ప్రభుత్వ కృషి వల్ల దేశ వ్యవసాయ ఎగుమతులు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయన్నారు. 2020-21 సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 25 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయన్నారు. ఈ ఎగుమతి దాదాపు రూ.3 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లక్ష 80 వేల కోట్ల రూపాయలు అందించారన్నారు. ఈ పెట్టుబడితో నేడు వ్యవసాయ రంగంలో పెను మార్పులు కనిపిస్తున్నాయన్నారు. అలాగే డిజిటల్ ఇండియా సందర్భంలో దేశం యూపీఐ ప్లాట్‌ఫారమ్ విజయవంతమవడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వ్యాప్తి కోసం ప్రభుత్వం చూపిన విజన్‌ను కూడా నేను అభినందిస్తున్నానన్నారు. డిసెంబర్ 2021లో దేశంలో యూపీఐ ద్వారా 8 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగాయన్నారు. గత సంవత్సరాల్లో అవిశ్రాంత ప్రయత్నాల వల్ల ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు రెండు కోట్లకు పైగా పక్కా గృహాలు అందించబడ్డాయన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్’కింద గత మూడేళ్లలో సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయలతో.. కోటి పదిహేడు లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయన్నారు.

హర్ ఘర్ జల్ అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావడం ప్రారంభించిందన్నారు. 2021-22లో 28 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.65 వేల కోట్ల సాయం అందించారన్నారు. ఈ మొత్తం 2014-15 కంటే 4 రెట్లు ఎక్కువ అన్నారు. ట్రిపుల్ తలాక్‌ను చట్టరీత్యా నేరంగా ప్రకటించడం ద్వారా సమాజాన్ని ఈ దురాచారాల నుంచి విముక్తి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ప్రోత్సాహంతో వివిధ పోలీసు బలగాల్లో మహిళా పోలీసుల సంఖ్య 2014తో పోలిస్తే రెట్టింపు అయ్యింద‌న్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా స్థానిక భాషలను ప్రచారం చేస్తున్నారన్నారు.

భారతీయ భాషల్లో కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలను నిర్వహించడంపై దృష్టి సారిస్తున్నారన్నారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లోని 19 ఇంజినీరింగ్ కాలేజీల్లో 6 భారతీయ భాషల్లో బోధన ప్రారంభమవుతుందన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత యువశక్తి సామర్థ్యాన్ని మనమందరం చూశామ‌న్నారు.యువతకు అంతులేని కొత్త అవకాశాలకు స్టార్టప్ ఎకో-సిస్టమ్ ఒక ఉదాహరణ.నేడు ఇంటర్నెట్ ఖర్చు తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. స్మార్ట్‌ ఫోన్ల ధర కూడా తక్కువగా ఉందన్నారు. దీని వల్ల భారత యువ తరానికి భారీ ప్రయోజనం కలుగుతోందన్నారు. భారతదేశం మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా భారత్ అవతరించింది. మహిళా సాధికారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement