ఇంట్లోనూ మాస్క్‌లు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లకూడదని కూడా సలహా ఇచ్చింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మీడియాతో మాట్లాడారు. ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే మిగతా వాళ్లంతా ఇంట్లోనూ మాస్కులు పెట్టుకోండి. అసలు నా అభిప్రాయం ప్రకారం అందరూ ఇంట్లోనూ మాస్కులు పెట్టుకుంటే మంచిది అని వీకే పాల్ అన్నారు.
కరోనా సోకిన వ్యక్తి కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. ఇతర వ్యక్తులు కూడా ఇంట్లో అందరితో కూర్చున్నప్పుడు మాస్కులు పెట్టుకుంటే మంచిది. కరోనా సోకిన వ్యక్తి ప్రత్యేకంగా మరో గదిలో ఉండాలి అని ఆయన చెప్పారు. ఏమాత్రం లక్షణాలు ఉన్నా రిపోర్ట్ వచ్చే వరకూ వేచి చూడకుండా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలని వీకే పాల్ సూచించారు. ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ వచ్చినా సరే అంతవరకూ లక్షణాలు ఉంటే పాజిటివ్‌గానే భావించి అందరికీ దూరంగా ఉంటే మంచిదని చెప్పారు. ఇక కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా మాస్కులు లేకపోవడం వల్ల ఉన్న ముప్పు గురించి ప్రస్తావించారు. ఇద్దరు వ్యక్తులు మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకపోతే ఇన్ఫెక్షన్ సోకే ముప్పు 90 శాతం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.