హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉద్యోగ బదలీలకు సుదీర్ఘవిరామం తర్వాత శుభ గడియలు వచ్చాయి. వారంలోగా మార్గ దర్శకాలు విడుదలవ నున్నాయి. బదలీల ఫైల్ సీఎం కేసీఆర్‌కు చేరడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయ బదలీలపై నెలకొన్న అనిశ్చితి తొలగడంతో ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతించినట్లుగా సమాచారం. తొలుత ఈ ఏడాది మార్చి నెలఖరలోనే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో బదలీలు పూర్తి చేయాలని భావించారు. అయితే తాజా రాజకీయ పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అయితే ఎన్నికల సంఘం సూచనలు మేరకు ఎన్నికల విధులతో సంబంధం ఉన్న శాఖలైన రెవెన్యూలో తహశీల్దార్ నుంచి ఆర్డీవో ర్యాంక్ వరకు బదలీలు జరగనున్నాయని తెలుస్తోంది. ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల్లో కూడా ఉద్యోగ బదలీలకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేస్తోంది.
కొంత కాలంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదలీలపై ప్రభుత్వం భారీగా కసరత్తు చేస్తోంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో కొన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు, ఐపీఎస్‌లను, కమిషనర్లను మార్పులు చేసింది. అదే కొనసాగింపుతో ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్న పలు శాఖల్లో మార్పులు చేయాలని భావించింది. అయితే అనేక కారణాలతో ఉన్నత స్థాయి బదలీలకు ఆలస్యం ఎదురైంది. కాగా, ఎన్నికల ఏడాదిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదలీలు అనివార్యం కాగా, క్షేత్రస్థాయిలో పలు రాబడి శాఖలు, ఎన్నికల విధులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న శాఖల ఉద్యోగుల బదలీలకు తాజాగా నిషేదం తొలగిపోయింది. అడ్డంకులు తొలగడంతో వెనువెంటనే బదలీ షెడ్యూల్‌తోపాటు, మార్గదర్శకాలూ వెలువడనున్నాయి. రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపు సగం మంది బదలీలు కోరుతున్నట్లు తెలిసింది. అయితే ఇందులో అర్హులను గుర్తించడం, పారదర్శకంగా బదలీ ప్రక్రియ, అవినీతి లేకుండా బదలీలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకోనుంది. దాదాపు ఏడెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతన్న బదలీల నేపథ్యంలో ఎక్కడా ఆరోపణలకు తావులేకుండా మొత్తం ప్రక్రియను పారదర్శకంగా 15 రోజుల్లోపు పూర్తిచేయాలని యోచిస్తోంది. నిబంధనలు, మార్గదర్శకాల్లో భాగంగా భార్యభర్తలు(స్పౌజ్), మ్యూచువల్ బదలీలను వివాదాలు లేకుండా తొలిదశలోనే పూర్తి చేయాలని షెడ్యూల్‌ను సిద్దం చేస్తున్నారు. ఆ తర్వాతే దివ్యాంగులు, మెడికల్ గ్రౌండ్స్, ఒంటరి మహిళల బదలీలకు ప్రాధాన్యతనిచ్చేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో తాత్కాలిక పద్దతిలో ఇంకా ఆర్డర్ టూ సర్వ్ పద్దతిపై పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. వీరి విజ్ఞప్తులను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. పట్టణ ప్రాంతాల నుండి వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లేవారికి ప్రభుత్వం ప్రత్యేక వసతులు, అలవెన్సులు అందించి ప్రోత్సహించాలని నిర్ణయించింది. సుదీర్ఘ కాలంగా వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని నేరుగా పట్టణాలకు అనుమతించేలా కసరత్తు చేస్తున్నారు. అన్ని శాఖల్లో అర్హులైన ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని హెచ్‌ఓడీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రెండేళ్ల సర్వీస్ పూర్తయిన వారికి పదోన్నతుల అంశం కూడా పరిశీలనలో ఉంది. వీరి జాబితా కూడా సిద్ధం చేస్తున్నారు.
మార్గదర్శకాలు ఇలా…
- ముందుగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకునేలా అవకాశం
- సర్వీసు, సీనియార్టీ జాబితాలు సిద్ధం చేసి, ఉద్యోగుల్లో వితంతువులు, దివ్యాంగులు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు, సీనియార్టీ జాబితాలు రూపొందిస్తారు.
- ఇప్పటివరకు 20 శాతం మందికి మించకుండా బదలీలు చేయరాదని ఉన్న నిబంధన ఎత్తివేత
- సీనియార్టీకి ఆన్‌లైన్‌లో జాబితా
- శాఖలవారీగా ఉద్యోగుల పేర్లతో సహా సీనియార్టీ జాబితా, కలెక్టరేట్లలో నోటీస్ బోర్డులో జాబితా
- ఖాళీల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో
- ఆన్‌లైన్‌లోనే ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
- తాము కోరుకున్న స్థానం ఆన్‌లైన్‌లో ఎంచుకోవాలి
- ఇందుకు 24 గంటల సమయం
- ఒకేచోట రెండేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగి బదలీకి దరఖాస్తు చేసుకోవాలి
- ఐదేళ్లుగా ఒకేచోట ఉన్నవారి బదలీ తప్పనిసరి
- క్రానిక్ డిసీజెస్ (మెడికల్ సమస్యలు) ఉన్నవారికి, ఆ తర్వాత ఏడాదిలో పదవీ విరమణ ఉన్నవారికి, సింగిల్ విమెన్, వికలాంగులకు ప్రాధాన్యత
- మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు, లాంగ్‌స్టాండింగ్‌లకు, అంధత్వం ఉండి ఐదేళ్ల సర్వీస్ ఒకేచోట పూర్తయిన వాళ్లకు తప్పనిసరి బదలీ చేయరు
- వారు కోరితే రెండేళ్లు పూర్తవకున్నా బదలీ అవకాశం
- బదలీల్లో భాగంగా ఒకే రకమైన అర్హతలు ఉండి ఒకే పోస్టింగ్‌ను ఇద్దరూ కోరుకుంటే లాటరీ ద్వారా ఎంపిక
- ఇంకొకరికి ఆప్షన్ ద్వారా అవకాశం