మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తానని సినీ నీటి, ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో సీఎం ఇంటికి భారీగా శివసేన కార్యకర్తలు చేరుకున్నారు. ఉద్దవ్ థాక్రే ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు నవనీత్ కౌర్ కు పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. హనుమాన్ చాలీసా పారాయణానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ నివాసం ఎదుట శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడి ఆందోళనకు దిగారు. నవనీత్, ఆమె భర్తకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీనిపై నవనీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నివాసం వద్ద దౌర్జన్యం చేయాలంటూ శివసేన కార్యకర్తలను ముఖ్యమంత్రే ఆదేశించారని ఆరోపించారు. వారు బ్యారికేడ్లను సైతం తోసివేస్తూ ముందుకు వస్తున్నారని వివరించారు. తాను మరోసారి చెబుతున్నానని, థాకరేల నివాసం మాతోశ్రీ వద్దకు వెళ్లి హనుమాన్ చాలీసా పఠించి తీరుతానని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు.