ఉమ్మడి ఆదిలాబాద్, ప్రభన్యూస్ బ్యూరో: పెద్దపులుల కదలికలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అలజడి సృష్టిస్తున్నాయి. కాగజ్‌నగర్ మండలం దారిగాం శివారులో ఒక ఆడపులి తీవ్ర గాయాలతో మృత్యువాత పడిన సంఘటన అటవీశాఖ అధికారుల్లో కలకలం రేపుతుండగా, తూర్పు, పశ్చిమ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంలో పెద్దపులుల సంచారం పెరిగిపోతున్నా అటవీశాఖ యంత్రాంగం నిర్లిప్తంగానే వ్యవహరిస్తోంది. పొరుగు మహారాష్ట్రలోని తాడోబా వన్యప్రాణి విభాగం నుండి ప్రాణహిత నది దాటి కాగజ్‌నగర్, జైపూర్, చెన్నూరు వరకు కారిడార్‌గా ఏర్పడి పెద్దపులులు వలస వస్తున్నా వాటి ఆవాసం, సంరక్షణ గురించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా పెన్‌గంగ నదీ పరివాహక ప్రాంతం పరిధిలోని తాంసి కె, భీంపూర్ మండలాల్లో రెండునెలల పాటు పులుల సంచారం పెరుగడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హడలెత్తిపోయారు. మైదాన ప్రాంతాల్లోకి పులులు రావడంతో ఇక్కడి ప్రజలు హైరానా పడగా ఆతర్వాత తిరిగి మహారాష్ట్రలోని తాడోబా ప్రాంతానికి వెనక్కి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ప్రాణహిత సరిహద్దులోని కాగజ్‌నగర్ రూరల్ మండలం దారిగాం శివారులో ఆడపులి మృత్యవాత పడ్డ సంఘటన అటవీశాఖాధికారుల్లో అలజడి రేపింది. మరో ఆడ పులితో ఘర్షణ పడి రెండు పులులు దాడి చేసుకున్న ఘటనలోనే రెండుసంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపులి మృత్యువాత పడిందని, మరో పశువు కూడా చనిపోయిందని అటవీశాఖ డీఎఫ్‌ఓ నీరజ్ కుమార్ ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ఇటీవల జరిగిన పులుల సంచారం, పశువులపై దాడుల సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి.
కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఒకటి రెండు పులుల మినహా కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోనే 8 నుంచి 10 పులులు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతం ప్రాణహిత పెద్దవాగు పరివాహక ప్రాంతాలు పులుల ఆవాసానికి అనుకూలంగా ఉంటాయి. గడ్డితోపాటు వన్యప్రాణులు కూడా అధికంగా ఉండటంతో ఆహారం కోసం పులులు ఈ ప్రాంతంలో అధికంగా సంచరించి ఇక్కడే ఆవాసం ఏర్పర్చుకుంటున్నట్లు పరిస్థితులను బట్టి తెలుస్తోంది. గత డిసెంబర్‌లో కాగజ్‌నగర్, వాంకిడి ప్రధాన రహదారి సమీపంలో పశువుల మందపై పులి దాడి చేసి ఒక పశువును హతమార్చగా అక్కడే ఉన్న పసువుల కాపరి గులాబ్ దాస్‌పై దాడి చేసిన ఘటనలో అతను తీవ్రగాయాలతో బయటపడ్డాడు. గత ఏడాది కాగజ్‌నగర్ పట్టణంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే ఓ వ్యక్తి ఆసిఫాబాద్ నుండి కాగజ్‌నగర్ వస్తుండగా అంకుసాపూర్ రహదారిలో ఒక్కసారిగా పులి రోడ్డు దాటుతూ కనిపించింది. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని సిర్పూర్ టి, కాగజ్‌నగర్ ఫారెస్టు రేంజ్ ఏరియాల్లో ఒక పులి నాలుగు పిల్లలతో సంచారం చేస్తున్నట్లు అటవీ అధికారులు సైతం నిర్ధారించారు.
పులి పిల్లలు నాలుగు నెలల తర్వాత పెద్దగా ఎదిగి ఒంటరిగా సంచరించడానికి అవకాశం ఉంటుందని, అప్పటివరకు తమ వెంట పులులు పిల్లలను సంరక్షించుకుంటాయని పేర్కొంటున్నారు. అయితే ఇటీవల ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బీంపూర్, గొల్లగాట్, తాంసి కె ప్రాంతాల్లో తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి పెన్‌గంగ నదీ పరివాహక ప్రాంతంలో తాగునీటి కోసం వచ్చి నదీ తీరం దాటి ఆదిలాబాద్ జిల్లాలో పులులు ప్రవేశించిన సంఘటనలు హడలెత్తించాయి. పంట చేలకు వెళ్లకుండా రైతులు ముఖ్యంగా మహిళలు ఇంట్లోనే ఉండిపోగా మరికొందరు పగటి పూట పంట చేలలో పనిచేసి పులి భయంతో సాయంత్రం లోపు ఇంటికి తిరిగి వచ్చేవారు.
పెద్ద పులులపై స్మగ్లర్ల కన్ను
పంట చేల రక్షణ కోసం అడవి పందుల బెడద నుండి తప్పించుకునేందుకు రక్షణగా పంట చేల చుట్టూ బిగిస్తున్న ఉచ్చుల్లో పడి వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఉచ్చులు జంతువుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. మరోవైపు వేటగాళ్ల ఉచ్చులతో పెద్దపులులతో పాటు అటవీ జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో మంచిర్యాల పరిధిలోని శివారం అటవీ ప్రాంతంలో పందుల బెడద నుండి తప్పించుకునేందుకు కరెంటు తీగలు అమర్చగా వీటి ఉచ్చులో పడి ఒక పులి ప్రాణాలు కోల్పోయింది. లక్షెట్టిపేట పరిధిలోనూ అటవీ జంతువుల కోసం పెట్టిన ఉచ్చులో ఒక చిరుతపులి కూడా మరణించింది. చెన్నూరు ప్రాంతంలోని తంగిడి సోమారం, ఖానాపూర్ రేంజ్ పరిధిలోని పెంబి అటవీ ప్రాంతాల్లో పంట చేల రక్షణ కోసం పెట్టిన ఉచ్చులతో పులులతో పాటు వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతుండగా పలు చోట్ల రైల్వేట్రాక్‌లపై నుండి దాటుతూ రైలు ప్రమాదాల్లో పులులు మృతి చెందిన సంఘటనలు ఇప్పటికీ జిల్లాలో కోకొల్లలు. పెద్దపులుల సంరక్షణ కోసం ప్రతీ ఏటా ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుండగా వాటి సంరక్షణ, ఆవాస ప్రాంతాల్లో పులుల గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగా అడవుల్లో మగపులుల మధ్యనే ఘర్షణలు జరుగుతుంటాయి తప్ప ఆడపులుల మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు ఉండదని అటవీ అధికారులే చెపుతుంటారు. అయితే దారిగాంలో ఆడపులి మృతిపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరో పులి దాడిలో మృతి చెందిందా లేక స్మగ్లర్ల వేటుకు బలైందా అన్నది ఇప్పటికీ అంతుపట్టడం లేదు.
కవ్వాల్ కోర్ ఏరియాలో పులుల సంరక్షణకు ప్రణాళిక
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏరియా పరిధిలో పెద్దపులుల సంరక్షణ కోసం రెండు గ్రామాలను తరలించేందుకు రూ. 24 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. కవ్వాల్ కోర్ ఏరియాలో మొత్తం 37 గ్రామాలుండగా మైసంపేట, రాంపూర్ గ్రామాలను రీలొకేషన్‌లో భాగంగా పెద్దపులుల సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు గ్రామాలను కడెం మండలానికి తరలించేలా అటవీశాఖాధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల పరిహారంతోపాటు 2.81 ఎకరాల భూమి ఆ గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు, రహదారులు, అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.