సీఎం కేసీఆర్ ఇవ్వాల (శనివారం) బిజీ బిజీగా గడిపారు. మధ్యాహ్నం ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత టీఆర్ఎస్ భవన్లో లెజస్లేచర్ పార్టీ (టీఆర్ఎస్ఎల్పీ) సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్న ఈ సమావేశంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా కూడా సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామన్న కేసీఆర్… ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కష్టపడి పని చేయాలన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు విజయావకాశాలు ఉన్నాయన్న కేసీఆర్.. ఇక.. ఎన్నికల్లో పార్టీకి 72 నుంచి 80 సీట్ల దాకా వస్తాయని చెప్పారు. సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికను కూడా టీఆర్ఎస్సే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిస్తే… బీజేపీకి దక్కేది మూడో స్థానమేనన్నారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అసలు పోటీలోనే లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉప ఎన్నికలో నియోజకవర్గంలోని ప్రతి రెండు గ్రామాలకు ఓ ఎమ్మెల్యేను ఇన్‌చార్జీగా నియమించనున్నట్లు చెప్పారు.