హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉపరిత ద్రోణి ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినన వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పలుచోట్ల చెట్లు, ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. వర్షపు నీటికి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, అత్తాపూర్, సైదాబాద్, చంపాపేట్, సరూర్‌నగర్, నాగోల్, వనస్థలిపురం, తుర్కయంజాల్, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, తిరుమలగిరి, అల్వాల్, కంటోన్మెట్, మల్కాజిగిరి, ముషీరాబాద్, నాగోల్, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, కుషాయిగూడ, ఈసీఐఎల్, కాప్రాలో ఉరుములతోకూడి భారీ వర్షం కురిసింది.
అత్యధికంగా సీతాఫల్మండిలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. బంసీలాల్పేటలో 6.7, వెస్ట్ మారేడుపల్లిలో 6.1, అల్వాల్‌లో 5.9, ఎల్బీనగర్లో 5.8, బాలానగర్‌లో 5.4, ఏఎస్‌రావ్ నగర్లో 5.1, బేగంపేట పాటిగడ్డలో 4.9, మల్కాజ్‌గిరిలో 4.7, ఫలక్‌నుమాలో 4.6, గన్‌ఫౌండ్రీలో 4.4, కాచిగూడ, సికింద్రాబాద్‌లో 4.3, చార్మినార్‌లో 4.2, గుడిమల్కాపూర్, నాచారంలో 4.1, అంబర్‌పేటలో 4, అమీర్‌పేట, సంతోష్‌నగర్‌లో 3.7, ఖైరతాబాద్‌లో 3.6, బేగంబజార్, హయత్‌నగర్, చిలుకానగర్‌లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.