Friday, November 22, 2024

టీబీ నిర్మూలనలో తెలంగాణకు మూడు పతకాలు – హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌: టీబీ నిర్మూలనకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలంగాణలో మూడు జిల్లాలకు అవార్డులు ప్రకటించింది. గురువారం ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు వీటిని అందుకున్నారు. జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ‘టీబీ రహిత’ ధ్రువపత్రాలను అందించేందుకు కేంద్రం ‘సబ్‌ నేషనల్‌ టీబీ ఫ్రీ సర్టిఫికేషన్‌’ (ఎస్‌ఎన్‌సీ) సర్వే నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాలను ఎంపిక చేసి సర్వే చేసింది. జోగుళాంబ గద్వాల, నిజామాబాద్‌, ఖమ్మం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు సర్వే చేసింది. 2015 నుంచి 2021 మధ్య కేసుల నమోదును పరిశీలించింది. అనంతరం నిజామాబాద్‌కు వెండి పతకం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కాంస్య పతకాలను ప్రకటించింది. గురువారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, తెలంగాణ టీబీ ప్రోగ్రాం జాయింట్‌ డైరెక్టర్‌ రాజేశం, మూడు జిల్లాల అధికారులు సుదర్శనం (నిజామాబాద్‌), సుబ్బారావు (ఖమ్మం), శ్రీనివాస్‌ (భద్రాద్రి కొత్తగూడెం), ప్రపంచ ఆరోగ్య సంస్థ బృంద సభ్యులు శాంత ఆచంట, మహేశ్‌ గొర్ల, శ్రీగణ, సుష్మ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్‌రావు హర్షం
మూడు జిల్లాలకు జాతీయ అవార్డులు రావడం పట్ల ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. అన్ని జిల్లాలు వీటిని ఆదర్శంగా తీసుకొని పని చేయాలని, టీబీని రూపుమాపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 వరకు టీబీని నిర్మూలించాలని లక్ష్యం నిర్దేశించగా, భారత్ 2025 నాటికి నిర్మూలించాలని లక్ష్యం నిర్దేశించిందని, అయితే తెలంగాణలో అంత కంటే ముందే టీబీ నిర్మూలన లక్ష్యంగా వైద్యారోగ్య సిబ్బంది పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్నారని, ఈ క్రమంలో ఈ ఏడాది బడ్జెట్ లో అధిక మొత్తంలో నిధులు కేటాయించారని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement