Tuesday, November 26, 2024

హైదరాబాద్ లో ఆక్సిజన్ అందక ముగ్గురి మృతి!

ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మరికొందరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆసుపత్రిలో జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడ్డారు. 20 మంది కరోనా రోగులు సుమారు గంటసేపు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు లెక్కగట్టారు. ఈ ఘటనలో ముగ్గురు కరోనా పేషేంట్ లు మృతి చెందారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ ఫిల్లింగ్ ట్యాంక్ లో ఆక్సిజన్ అయిపోవడంతో మరో ఆక్సిజన్ ట్యాంక్ రావటానికి ఆలస్యం కావడంతో ఈ సమస్య తలెత్తింది.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి రోజు వచ్చే ఆక్సిజన్ ఫిల్లింగ్ ట్యాంక్… డ్రైవర్ కు అడ్రస్ తెలియకపోవడంతో మొదటగా ఉస్మానియా ఆసుపత్రి వెళ్లాడు. వెంటనే విషయం తెలుసుకున్న నారాయణ గూడ పోలీసులు ట్యాంకర్ ను కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు.  అయితే అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ అయిపోయే వరకు ఆక్సిజన్ ని ఫిల్ చేయకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తమ వాళ్ల మృతికి కారణమైన వారిని శిక్షించాలని బంధువులు ఆస్పత్రి ఎదుట డిమాండ్ చేశారు.

ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్సలు అందించేందుకు మొత్తం 350 బెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో అత్యధికంగా 300 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయగా 50 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో 290 మంది రోగులు ఆక్సిజన్ బెడ్లలో చికిత్సలు పొందుతుండగా 50 మంది ఐసీయూ బెడ్లలో చికిత్సలు పొందుతున్నారు. ఆక్సిజన్ బెడ్లలో చికిత్సలు పొందుతున్నవారందరికి ఆక్సిజన్ ను అందించడంలో ఆస్పత్రి సిబ్బంది పూర్తిగా వైఫల్యం చెందింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement