ఐపీఎల్ నుంచి ఒకేసారి ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వెళ్లిపోయారు. వీరిలో ఆర్‌సీబీకి చెందిన ఇద్దరు, రాజస్థాన్ రాయల్స్ నుంచి ఒకరు వెళ్లిపోయినట్లు ఆయా ఫ్రాంచైజీలు వెల్లడించాయి. ఆర్సీబీ నుంచి ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ వెళ్లిపోతున్నట్లు ట్విటర్‌లో చెప్పింది. అటు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ ఆండ్రూ టై ఇప్పటికే ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.
వీళ్లంతా వ్యక్తిగత కారణాల వల్లే వెళ్లిపోయారని ఫ్రాంచైజీలు చెబుతున్నా.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటే దీనికి కారణమన్న అనుమానాలు ఉన్నాయి. అటు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇక ఈ సీజన్‌లో ఆడబోవడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనాతో పోరాడుతున్న కుటుంబానికి అండగా ఉండటాని కంటూ అతడు ఐపీఎల్ నుంచి వెళ్లిపోయాడు. అయితే ఏ ఫ్రాంచైజీ కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లు వెళ్లిపోవడానికి కరోనానే కారణమని చెప్పలేదు. ఐపీఎల్ 14వ సీజన్ తొలి 20 మ్యాచ్‌లు చెన్నై, ముంబైలలో జరగగా.. ఇక ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు షిఫ్ట్ కానున్నాయి. అయితే కరోనా కేసులు ఢిల్లీని వణికిస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో ఐపీఎల్ ఎలా జరుగుతుందో వేచి చూడాలి.