Saturday, November 23, 2024

కర్నాటక జడ్జీలకు బెదిరింపులు.. హిజాబ్‌ తీర్పు నేపథ్యంలో చంపుతామని హెచ్చరికలు

హిజాబ్‌ అంశంలో పిటిషన్లను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం న్యాయమూర్తులకు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. నిందితులు తమిళనాడుకు చెందినవారని తేలింది. వీరు ‘తమిళనాడు తౌహద్‌ జమాత్‌’ సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. తమిళనాడులోని మదురై జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో కోవై రహమతుల్లా, ఎస్‌ జమాల్‌ మహ్మద్‌ ఉస్మానీ అనే వ్యక్తులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆసంస్థ జిల్లా నాయకుడు రాజీవ్‌ మహ్మద్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ముగ్గురిపై ఐపీసీ 153 ఎ,505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జార్ఖండ్‌లో తప్పుడు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మార్నింగ్‌ వాక్‌లో చంపబడ్డారని వీరు ప్రస్తావించారు.

తమ సంఘంలో కొందరు భావోద్వేగ వ్యక్తులు ఉన్నారని రహమతుల్లా పేర్కొన్నట్లు వీడియో క్లిప్‌లో వెల్లడైంది. రహమతుల్లా ఆడిటింగ్‌ కమిటీ సభ్యుడుకాగా, ఉస్మానీ ప్రధాన కార్యాలయ స్పీకర్‌. గత జనవరిలో ఉడుపి జిల్లా కుందాపురలోని ఓ కళాశాలకు హిజాబ్‌తో వచ్చిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అడ్డుకుంది. దీన్ని ప్రశ్నిస్తూ, హిజాబ్‌ను అనుమతించాలని విద్యార్థినులు కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వివాదంపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్‌.. ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో ఏకరూప వస్త్రాల నిబంధనలను పాటించాలన్న సర్కారు ఆదేశాన్ని సమర్థించింది. సీజే రితూరాజ్‌ అవస్థి, న్యాయమూర్తులు కృష్ణ ఎస్‌ దీక్షిత్‌, జైబున్నీసా మొయినుద్దీన్‌ ఖాజీలతో కూడిన ధర్మాసనం పిటిషన్లు హేతుబద్ధంగా లేవంటూ కొట్టేసింది.

ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమిళనాడులో పలు ప్రాంతాల్లో వివిధ సంస్థలు నిరసనలు చేపట్టాయి. అందులో భాగంగా పలువురు.. కర్ణాటక న్యాయమూర్తులపై దాడిని ప్రోత్సహించేలా పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర జడ్జీలు ఉదయం నడకకు ఎక్కడికి వెళతారో తమకు తెలుసంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని పరిగణనలోకి తీసుకొని పలువురు న్యాయమూర్తులు, వివిధ పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

న్యాయమూర్తులకు వై కేటగిరి భద్రత
హిజాబ్‌ వివాదం కేసులో తీర్పు వెలువరించిన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులకు వై కేటగిరి భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదివారం ప్రకటించారు. బెదిరింపుల కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన అనంతరం.. వై కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించారు. బెదిరింపుల ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement