Friday, November 22, 2024

లాభాలు వస్తాయని నమ్మి కోట్లలో మోసపోయాం, ఆదుకోవాలే.. పోలీసులను ఆశ్రయించిన ఇన్వెస్టర్లు

ఫోన్​ యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశపడ్డారు చాలా మంది ఇన్వెస్టర్లు. ఇట్లా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి తొలినాళ్లలో కొంత అమౌంట్​ని తీసుకున్నారు. ఆ తర్వాత ఆ యాప్​ పనిచేయకపోవడం..  పైసా రిటర్న్​ రాకపోవడంతో తాము మోసపోయామని గుర్తించారు. ఇట్లాంటి వాటిలో ఈమధ్య కాలంలో ఇదే అతిపెద్ద స్కామ్‌ అని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్​ సిటీలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పెట్టుబడి పేరిట జరిగిన మోసంపై ఇవ్వాల పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మోసంలో వేలాది మంది ప్రజలు మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మల్టీజెట్‌ ట్రేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ జూన్‌లో హైదరాబాద్​లోని హబ్సిగూడలో ఆఫీసు ఏర్పాటు చేసి ఇన్వెస్టర్లను మోసం చేసిందని హైదరాబాద్‌లోని డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హైదరాబాద్ పోలీసు అధికారులు తెలిపారు. స్కామ్​లో మొత్తం పెట్టుబడులన్నీ ఫోన్-యాప్ ద్వారానే జరిగాయి. ఈ కంపెనీని స్థాపించింది మోతీలాల్ దులాల్ అనే వ్యక్తి, గతంలో కోట్లాది రూపాయల మోసం కేసులో ఇతను అరెస్టయ్యాడు.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హబ్సిగూడలోని మహేశ్వరినగర్‌లో కంపెనీని స్థాపించాడు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే రోజుకు 2 శాతం లాభం ఇస్తానని చాలామందిని మభ్యపెట్టాడు. దీంతో మంచి లాభాలు వస్తాయని ఆశపడిన చాలా మంది అతని లాభదాయకమైన ఆఫర్‌కు పడిపోయారు, కొంతమంది ఆన్‌లైన్ మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా జరిగే వ్యాపారంలో కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు.

మోతీలాల్ మొబైల్ ఫోన్ ఆధారిత అప్లికేషన్‌ను రూపొందించాడు. పెట్టుబడిదారులకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ లను ఇచ్చాడు. ప్రతి పెట్టుబడిదారుడు బ్యాంకు ఖాతా ఓపెన్​ చేసి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మొబైల్ యాప్‌కు బదిలీ చేసి, రోజు చివరిలో లాభాలను తీసుకోవాలని కోరినట్టు డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ కు చెందిన సీనియర్ అధికారి తెలిపారు.

- Advertisement -

భారీ లాభాలు వస్తున్నాయనే మాట పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో చాలా మంది వ్యక్తులు కంపెనీలో సభ్యులుగా చేరారు. దీంట్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. సెప్టెంబరు, అక్టోబరులో అనేక వేల మంది వ్యక్తులు కంపెనీలో చేరారు. ప్రారంభంలో వారందరికీ లాభాలు షేర్​ అయ్యాయి. అయితే, అదంతా కుంభకోణమని కొద్ది రోజులకు కానీ వారికి అర్థం కాలేదు. 

ఇక.. నవంబర్ మొదటి వారంలో మోతీలాల్ తన కార్యాలయానికి తాళం వేశాడు. మొబైల్ ఫోన్ అప్లికేషన్‌లోని లాభాలు షేర్​ అయ్యే విధానాన్ని బ్లాక్ చేసి తప్పించుకున్నాడు అని పోలీసులు తెలిపారు. దీంతో ‘మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్’ డిపాజిటర్లు, పెట్టుబడిదారులు  ఆఫీసుకు వెళ్లి చూడగా అది తాళం వేసి ఉంది. వీరంతా రాంనగర్‌లోని మోతీలాల్‌ ఇంటికి వెళ్లగా అక్కడ కూడా తాళం వేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు కంప్లెయింట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, మంగళవారం బాధితులు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది పెద్ద కుంభకోణమని, కంపెనీ వేల కోట్లు మోసగించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement