Wednesday, November 20, 2024

తీరం దాటిన తుఫాన్.. పలు రాష్ట్రాల్లో తీరని నష్టం

పశ్చిమ తీర ప్రాంతంలో తౌకతే తుఫాన్ బీభ‌త్సం సృష్టించింది. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, గోవా తీర ప్రాంతాలు తుఫాన్ దెబ్బ‌కు విల‌విల‌లాడాయి. గంట‌కు 185 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌చండ గాలులు వీచాయి. 3 మీటర్లకు పైనే భీక‌ర అల‌లు ఎగ‌సిప‌డ్డాయి. అతి భారీ వర్షాలతో తుఫాన్ గుజరాత్‌లోని పోర్ బందర్‌, మహువా మధ్య తీరం దాటింది. తుఫాన్ తీరం దాట‌డానికి 3 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. దీని తీవ్రతకు గుజరాత్‌లో పెద్దఎత్తున చెట్లు నేలకొరిగాయి. భారీ వర్షాలు, పెనుగాలులు గుజరాత్‌ను ఇంకా వణికిస్తున్నాయి. జునాగఢ్, అమ్రేలి, గిర్ సోమ్ నాథ్ జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై విమానాశ్రయంలో రాకపోకల్ని నిలిపివేశారు. మొత్తం 55 సర్వీసులు రద్దయ్యాయి. ముంబై తీరంలో రెండు నౌకలు కొట్టుకుపోయాయి. ఒక దానిలో 273 మంది, రెండో నౌక‌లో 137 మంది ఉన్నారు. లంగరు వేసి ఉంచినా పెనుగాలుల ధాటికి నౌకలు కొట్టుకుపోయాయి. స‌హాయ‌క బృందాలు రంగంలోకి దిగ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది.


కాగా తుఫాన్ తీవ్రత కారణంగా మ‌హారాష్ట్ర‌, గుజరాత్‌, గోవా సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి hoవివరాలు తెలుసుకున్నారు. తుఫాన్ దెబ్బకు ఆయా రాష్ట్రాలలో భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల‌కొరిగాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నాయి. తుఫాన్ ప్ర‌భావంతో మ‌హారాష్ట్ర‌, గోవా, తెలంగాణ‌, క‌ర్ణాటకలో ఇవాళ కూడా వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. అటు తౌకతే తుఫాన్ కారణంగా హైద‌రాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement