తమిళనాడు విద్యాశాఖ మంత్రి కేపొన్ముడి హిందీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడేవారు కోయంబత్తూర్‌లో పానీపూరీలు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడు ప్రజలు ఇంగ్లిష్, తమిళం నేర్చుకుంటుండగా ఇతర భాషల అవసరం ఏముందని మంత్రి ప్రశ్నించారు. కోయంబత్తూర్‌లోని భారతీయర్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. తమిళనాడులో ఇంగ్లిష్, తమిళ భాషలున్నాయని, ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష కాగా, తమిళం స్ధానిక బాషని చెప్పుకొచ్చారు.
హిందీ నేర్చుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయని కొంతమంది చెబుతున్నారు.. మనకు ఉద్యోగాలు వస్తున్నాయా? అని మంత్రి కేపోన్ముడి ప్రశ్నించారు. తమిళనాడులో, కోయంబత్తూర్‌లో ఎక్కడికైనా వెళ్లి చూస్తే హిందీ మాట్లాడే వారు పానీపూరీలు అమ్ముకుంటూ బతుకుతున్నారని చెప్పారు. తాము అంతర్జాతీయ భాషగా ఇంగ్లిష్ నేర్చుకుంటుండగా ఇతర భాషలతో పనేం ఉందని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు విద్యావ్యవస్ధ దేశంలోనే ప్రామాణికంగా ముందువరుసలో ఉందని, తమిళ విద్యార్ధులు ఏ భాష నేర్చుకునేందుకైనా సిద్ధంగా ఉంటారని అన్నారు. హిందీ కేవలం ఆప్షనల్ ల్యాంగ్వేజ్ మాత్రమేనని, దాన్ని నేర్చుకోవడం తప్పనిసరి కాదని అన్నారు.